నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురిచేస్తోందంటూ జరుగుతున్న ప్రచారంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. ఇదంతా కేసీఆర్ డ్రామా అని అన్నారు. టీఆర్ఎస్ కట్టు కథలు చూస్తే ప్రజలంతా నవ్వుకుంటారని విమర్శించారు. బండి సంజయ్ బుధవారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ.. స్క్రీన్ ప్లే, డైరెక్టన్ అంతా ప్రగతిభవన్‌దేనని అన్నారు. ఫాంహౌస్‌లో ఉన్నవాళ్లు బీజేపీ వాళ్లని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. కొన్ని మీడియా ఛానళ్లు అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఫాంహౌజ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలదని, ఫిర్యాదు చేసింది కూడా వాళ్లే అన్నారు. నిందతులు, బాధితులు కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలని అన్నారు. గతంలో ఒక మంత్రిపై హత్యాయత్నం జరిగిందని డ్రామాలు ఆడారని.. ఇప్పుడు బేరసారాల నాటకాలాడుతున్నారని మండిపడ్డారు. బేరసారాలకు స్వామీజీలు ఎక్కడైనా వెళ్తారా? అని ప్రశ్నించారు. హిందూ ధర్మం అంటే కేసీఆర్ కు ఎందుకంత కోపం? ఈ ఘటనపై మూడు రోజులుగా ఎమ్మెల్యేలు సమావేశమై కుట్రలు చేశారని మండిపడ్డారు.
నలుగురు ఎమ్మెల్యేలను పీఎస్‌కు ఎందుకు తరలించలేదు? వారు నేరుగా ప్రగతిభవన్‌కు ఎలా వెళ్తారు? అని బండి సంజయ్ నిలదీశారు. ఆ నలుగురు ఎమ్మెల్యేలను అర్ధరూపాయికి కూడా ఎవరూ కొనరని అన్నారు. తన పార్టీ ఎమ్మెల్యేలను బెదిరించేందుకే కేసీఆర్ ఈ నాటకాలు అడుతున్నారని తెలిపారు. ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా చూసుకునేందుకే ఈ నాటకమాడారన్నారు. కేసీఆర్ నాటకమంతా త్వరలోనే బయటపడుతుందన్నారు బండి సంజయ్. ఈ నాటకమంతా కేసీఆర్ మెడకే చుట్టుకుంటుందన్నారు. హిందూ సమాజాన్ని కించపరిచేందుకు కేసీఆర్ కుట్రపన్నారన్నారు. హిందూ సమాజాన్ని కించపరిచేందుకే స్వామీజిని ఇరికించారన్నారు. టీఆర్ఎస్ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేస్తామన్నారు. ఫాంహౌస్ అడ్డాగా గుట్కా వ్యాపారం జరుగుతోందని ఆరోపించారు. కేసీఆర్ కు ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని యాదగిరి నర్సింహాస్వామి ఆలయంలో ప్రమాణం చేయగలరా? అని బండి సంజయ్ సవాల్ విసిరారు. పోలీసులు కూడా బాధ్యతగా వ్యవహరించాలని, బీజేపీపై అనవసర ఆరోపణలు చేయొద్దని హెచ్చరించారు.
మరోవైపు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా టీఆర్ఎస్ ఆరోపణలపై తీవ్రంగా మండిపడ్డారు. ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంతో బీజేపీకి సంబంధం లేదని స్పస్టం చేశారు. తమకు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదన్నారు. టీఆర్ఎస్, కేసీఆర్ డ్రామాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు.
Also Read : తెరాస ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నాలు ?