Tuesday, September 17, 2024
HomeTrending Newsభారత్ వ్యూహాత్మక శత్రువు కాదు - చైనా

భారత్ వ్యూహాత్మక శత్రువు కాదు – చైనా

భారత్ విషయంలో చైనా వైఖరిలో మార్పు వస్తున్నట్టుగా కనిపిస్తోంది. గత వారం రోజులుగా వరుసగా చైనా నేతల ప్రకటనలు చూస్తుంటే రాజకీయ విశ్లేషకులు ఇదే భావన వ్యక్తం చేస్తున్నారు. భారత్ ను వ్యూహాత్మక శత్రువుగా చైనా భావించటం లేదని ఆ దేశ రాయబారి అన్నారు. బంగ్లాదేశ్ లో చైనా రాయబారి లి జిమింగ్ ఈ రోజు ఢాకాలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ… భారత్ ను శత్రువుగా చైనా ఏనాడు ఉహించుకోలేదని స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య ఉన్న భౌగోళిక, ఆర్ధిక సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటామన్నారు.

భారత్ లో చైనా రాయబారి సన్ వేడాంగ్ వారం రోజుల క్రితం ఇదే కోవలో ప్రకటించారు. భారత్ – చైనా దేశాలు భౌగోళిక రాజకీయాల ఉచ్చులో పడకూడదని అన్నారు. రెండు దేశాల స్నేహాన్ని పటిష్టం చేసేందుకు కొత్త ఒరవడి సృష్టించాలన్నారు. 2019 నుంచి భారత్ లో చైనా రాయబారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సన్ వేడాంగ్ కు గత మంగళవారం ఢిల్లీ లో వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సన్ మాట్లాడుతూ సమస్యల కన్నా ఇరు దేశాల ప్రయోజనాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా.. పరస్పరం గౌరవించుకుంటూ…  అభివృద్ధి పథంలో పయనించాలన్నారు.

అమెరికా, యూరోప్ దేశాలతో చైనా సంబంధాలు రోజు రోజుకు బెడిసికోడుతున్నాయి. దీనికి తోడు ఆఫ్రికా, లాటిన అమెరికా, దక్షిణ అమెరికా దేశాల్లో చైనా కంపనీల పనితీరుపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. చైనా చేపట్టిన ప్రాజెక్ట్ లు నాసిరకంగా ఉన్నాయని ప్రభుత్వాలు ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు. భారత్ పొరుగున నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక లో కూడా ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో నిరసనలు వస్తున్నాయి. ప్రభుత్వాలు చైనాకు అనుకూలంగా ఉన్నా ప్రజల నుంచి నిరసనలు, విమర్శలు రావటం గమనార్హం. ఈ నేపథ్యంలో అతి పెద్ద వినిమయ మార్కెట్ గా ఉన్న భారత్ తో సంబంధాలు చైనాకు అవశ్యకమయ్యాయి.

Also Read : గల్ఫ్ దేశాలపై చైనా ఒత్తిడి

RELATED ARTICLES

Most Popular

న్యూస్