పురుషుల టి20 వరల్డ్ కప్ లో నేడు జరిగిన మ్యాచ్ లో శ్రీలంకపై న్యూజిలాండ్ 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ లో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ 15 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో డెరిల్ మిచెల్- గ్లెన్ ఫిలిఫ్స్ లు నాలుగో వికెట్ కు 84 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. మిచెల్, నాన్ స్ట్రయికింగ్ ఎండ్ లో ఉంటూ ఫిలిప్స్ కు సహకరించి 22 పరుగులు చేసి 15వ ఓవర్లో పెవిలియన్ చేరాడు. గ్లెన్ ఫిలిప్స్ 64 బంతుల్లో 10 ఫోర్లు, 4సిక్సర్లతో 104 పరుగులు చేసి చివరి ఓవర్లో ఔటయ్యాడు. కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది.
లంక బౌలర్లలో కాసున్ రజిత రెండు; మహేష్ తీక్షణ, ధనంజయ డిసిల్వా, హసరంగ, లాహిరు కుమారా తలా ఒక వికెట్ సాధించారు.
ఆ తర్వాత శ్రీలంక పరుగుల ఖాతా మొదలు కాకముందే ఓపెనర్ పాతుమ్ నిశాంక వికెట్ కోల్పోయింది. బౌల్ట్ వేసిన రెండో ఓవర్లో కుశాల్ మెండీస్ (4); ధనంజయ డిసిల్వా (డకౌట్) ఇద్దరూ ఔటయ్యారు. జట్టులో భానుక రాజపక్ష(34); కెప్టెన్ దాసున్ శనక (35) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. 19.2 ఓవర్లలో 102 పరుగులకు శ్రీలంక ఆలౌట్ అయ్యింది.
కివీస్ బౌలర్లలో బౌల్ట్ నాలుగు; మిచెల్ శాంట్నర్, ఇష్ సోది చెరో రెండు; సౌతీ, ఫెర్గ్యుసన్ చెరో వికెట్ పడగొట్టారు.
సెంచరీ సాధించిన గ్లెన్ ఫిలిప్స్ కే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
Also Read : ICC T20 World Cup: ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మ్యాచ్ కూడా రద్దయ్యింది