కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ రోజు గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. గుజరాత్ ఎన్నికలు.. డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు విడతల్లో జరగనున్నాయి. డిసెంబర్ 8న కౌంటింగ్ ఉంటుంది. గుజరాత్‌లో 182 అసెంబ్లీ స్థానాలు ఉండగా మొత్తం ఓటర్లు 4.90 కోట్లు ఉన్నారు. మొదటి దశకు ఈ నెల 14 వ తేది వరకు తీసుకుంటారు. రెండో దశ నామినేషన్లు 17 వ తేది వరకు స్వీకరిస్తారు. నామినేషన్ల పరిశీలన మొదటి దశవి 15వ తేది, రెండో దశ 18 వ తేదిన చేస్తారు. నామినేషన్ ల ఉపసంహరణ కోసం మొదటి దశ 17 తేది వరకు రెండో దశకు నవంబర్ 18 వ తేది వరకు అవకాశం ఉంటుంది.
గుజరాత్ లో నియోజకవర్గాలు 182 కాగా అందులో జనరల్ స్థానాలు: 142, ఎస్సీ రిజర్వుడు: 13, ఎస్టీ రిజర్వుడు: 27 ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పోలింగ్ స్టేషన్లు 51,782 ఉన్నాయి. ఈ దఫా దేశంలోనే మొదటిసారిగా షిప్పింగ్ కంటైనర్లో పోలింగ్ బూత్ ఏర్పాటు. 217 మంది ఓటర్ల కోసం కంటైనర్ పోలింగ్ బూత్ ఏర్పాటు. కంటైనర్లో బూత్‌లో ఉండే అన్ని సదుపాయాల కల్పన. ఒక్క ఓటరు కోసం గిర్ అటవీ ప్రాంతంలో ఒక పోలింగ్ బూత్ ఏర్పాటు.
గత 25 ఏళ్లుగా బీజేపీ గుజరాత్‌ను పాలిస్తోంది. రాజకీయ ఒత్తిడిలతో గుజరాత్ షెడ్యూల్ ప్రకటించలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇదిలా ఉండగా మోర్బీ వంతెన కూలిన ఘటన బీజేపీ విజయవకాశాలపై ప్రభావం చూపించే అవకాశం ఉందని విశ్లేషకులు తెలుపుతున్నారు. ఫిబ్రవరి 18,2023తో గుజరాత్ అసెంబ్లీ ఐదేళ్ల కాల పరిమితి ముగియనుంది. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించింది. నవంబర్ 12న పోలింగ్ నిర్వహించి, డిసెంబర్ 8న ఫలితాలు ప్రకటిస్తారని వెల్లడించింది.
రానున్న ఎన్నికలలోబీజేపీ మళ్ళీ గెలుస్తుందా అన్నది చాలా సందేహంగానే ఉన్నట్లు వార్తలొస్తున్నాయి.ఇటీవల కేబుల్ బ్రిడ్జి దుర్ఘటనలో వందలాది మంది చనిపోవడంతో బీజేపీ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటన జరిగిన తర్వాత రెండు నెలలలో ఎన్నికలు వస్తూ ఉండటంతో… పొలిటికల్ గా బీజేపీకి రానున్న ఎన్నికలలో గెలుపు అంత సులువు కాదు అన్న టాక్ నడుస్తోంది. దీనికి తోడు ఈమధ్య ఆమ్ ఆద్మీ పార్టీ బలపడుతూ ఉంది.
ఇప్పటికే బీజేపీ, ఆప్ తో పాటు ఇతర పార్టీలు గుజరాత్ లో ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నాయి. ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే గుజరాత్ లో సభలు, ర్యాలీలు నిర్వహిస్తూ బీజేపీపై విమర్శల దాడిచేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం ప్రచారాన్ని ముమ్మరం చేశారు. దీంతో గుజరాత్ రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తోంది.