బీజేపీ, టీఆరెస్ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ విమర్శించారు. దేశంలో ఇంత తీవ్రమైన నిరుద్యోగ సమస్య ఎప్పుడూ లేదన్నారు. సంగారెడ్డి జిల్లాల్లో కొనసాగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ…రైతులు, యువకులు, విద్యార్థులు, చిన్న తరహా పరిశ్రమల సమస్యలు తెలుసుకుంటూ ముందుకెళుతున్నారు. జోగిపేట్ లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన రాహుల్ గాంధి…కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు దిగాజారాయని విమర్శించారు.
2014 తరువాత అక్కడ మోదీ, ఇక్కడ కేసీఆర్ నిరుద్యోగ సమస్యను తీవ్రతరం చేశారని రాహుల్ గాంధీ మండిపడ్డారు. ప్రభుత్వ సంస్థలను మోదీ ప్రయివేటుకు అమ్మేస్తున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని, తెలంగాణలో రైతుల పరిస్థితి అధ్వాన్నంగా తయారైందన్నారు. రైతు నాగిరెడ్డికి తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి కంటే ఎక్కువ తెలుసునని, ప్రభుత్వం నాగిరెడ్డి మాటలు వింటే రైతుకు మేలు జరుగుతుందన్నారు. సిఎం కేసీఆర్ రైతుల భూములు లాక్కుంటూ రైతుల గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు. మోదీ రైతు వ్యతిరేక చట్టాలకు టీఆరెస్ మద్దతు ఇచ్చిందని, విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా భారత్ జోడో యాత్ర చేపట్టామన్నారు. ప్రజల ప్రేమాభిమానాలతో భారత్ జోడో యాత్ర ముందుకెళుతోందని రాహుల్ గాంధీ తెలిపారు.