పురుషుల టి20 వరల్డ్ కప్, గ్రూప్-2లో ఇండియా మొదటి స్థానంలో నిలిచి సెమీస్ లోకి ప్రవేశించింది. గురువారం జరగనున్న సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ తో తలపడనుంది.
అడిలైడ్ మైదానంలో జింబాబ్వేతో నేడు జరిగిన మ్యాచ్ లో ఇండియా 71 పరుగుల తేడాతో విజయం సాధించింది. 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే ఇండియా బౌలర్ల ధాటికి 17.2 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
టాస్ గెలిచిన ఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది, 27 పరుగుల వద్ద కెప్టెన్ రోహిత్ (15) ఔటయ్యాడు. కోహ్లీ 26 స్కోరు చేసి వెనుదిరిగాడు. కెఎల్ రాహుల్ నేడు కూడా రాణించి వరుసగా రెండో అర్ధ సెంచరీ (51) సాధించాడు. ఈ టోర్నీలో మొదటి మ్యాచ్ ఆడిన రిషభ్ పంత్(3) విఫలం కాగా, హార్దిక్ పాండ్యా 18 పరుగులు చేసి ఔటయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ మరోసారి తన సత్తా చాటి కేవలం 25 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 61 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీనితో నిర్ణీత 20 ఓవర్లలో 186 పరుగులు చేసింది.
జింబాబ్వే బౌలర్లలో సీన్ విలియమ్స్ రెండు; ఎన్ గరవ, ముజారబని, రాజా తలా ఒక వికెట్ సాధించారు.
జింబాబ్వే…ఇన్నింగ్ తొలి బంతికే మొదటి వికెట్ (మదెవేరే డకౌట్) కోల్పోయింది. కాసేపటికే చకబ్వా కూడా డకౌట్ అయ్యాడు. జట్టులో రియాన్ బర్ల్-35; సికందర్ రాజా -34 పరుగులతో రాణించారు. మిగిలినవారు విఫలం కావడంతో భారీ ఓటమి పాలైంది.
ఇండియా బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ మూడు; మహమ్మద్ షమి, పాండ్యా చెరో రెండు; భువీ, అర్ష్ దీప్, అక్షర్ పటేల్ తలా ఒక వికెట్ సాధించారు.
సూర్య కుమార్ యాదవ్ కే ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.