ఇంగ్లాండ్ టి 20 వరల్డ్ కప్ 2022 విజేతగా నిలిచింది. నేడు జరిగిన ఫైనల్ లో పాకిస్తాన్ పై మరో 7 బంతులు ఉండగానే 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బెన్ స్టోక్స్ కీలక సమయంలో రాణించి 49 బంతుల్లో 5 ఫోర్లు ఒక సిక్సర్ తో 52 పరుగులు చేసి అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్ లో జరిగిన నేటి ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
పాకిస్తాన్ జట్టలో షాన్ మసూద్ 38; కెప్టెన్ బాబర్ అజమ్ 32 పరుగులతో రాణించారు. చివర్లో షాదా బ్ ఖాన్ 20 పరుగులు చేయడంతో పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 137 పరుగులు చేయగలిగింది. ఇంగ్లాండ్ బౌలర్లలో శామ్ కర్రన్ మూడు; అదిల్ రషీద్, జోర్డాన్ చెరో రెండు: స్టోక్స్ ఒక వికెట్ పడగొట్టారు.
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఏడు పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. సెమీఫైనల్ లో చెలరేగి ఆడిన హేల్స్ కేవలం ఒక పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.
కెప్టెన్ జోస్ బట్లర్ 26; హేరీ బ్రూక్స్ 20; మోయిన్ అలీ 19 పరుగులు చేసి ఔటయ్యారు.
శామ్ కర్రన్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ తో పాటు ప్లేయర్ ఆఫ్ ద సీరీస్ కూడా దక్కింది.
2010లో మొదటిసారి t20 విజేతగా నిలిచిన ఇంగ్లాండు నేటి విజయంతో రెండోసారి కప్ గెల్చుకుంది