పాకిస్తాన్-ఐర్లాండ్ మహిళా జట్ల మధ్య జరిగిన మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ ను ఐర్లాండ్ 2-1తేడాతో గెల్చుకుంది. నేడు జరిగిన ఆఖరి, మూడవ మ్యాచ్ లో 34 పరుగులతో ఆతిథ్య పాకిస్తాన్ ను ఓడించింది. మూడేసి మ్యాచ్ ల చొప్పున వన్డే, టి20 సిరీస్ ఆడేందుకు ఐర్లాండ్ పాక్ లో పర్యటిస్తోంది. వన్డే సిరీస్ ను పాక్ క్లీన్ స్వీప్ చేయగా… మొదటి, రెండవ టి20 మ్యాచ్ ల్లో ఐర్లాండ్, పాక్ చెరోటి గెల్చుకున్నాయి, సిరీస్ విజేతను నిర్ణయించే ఆఖరి మ్యాచ్ నేడు లాహోర్ లోని గద్దాఫీ స్టేడియంలో జరిగింది. ఐర్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి వికెట్ కు 110 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేసింది. గాబి లూయీస్ 46 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్సర్ తో 71; అమీ హంటర్ 35 బంతుల్లో మూడు ఫోర్లతో 40 పరుగులు చేసి ఔటయ్యారు. ఓర్లా పెందర్ గాస్ట్-37; రేబెకా స్టాకేల్-17 పరుగులతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది.
లక్ష్య ఛేదనలో పాక్ మహిళలు తడబడ్డారు. 17 పరుగులకే తొలి వికెట్ చేజార్చుకున్నారు, జట్టులో ఓపెనర్ జవేరియా ఖాన్ -50; నిదా దార్-26 మాత్రమే రాణించారు. 18.5 ఓవర్లలో 133 పరుగులకు పాక్ ఆలౌట్ అయ్యింది.
ఐర్లాద్ బౌలర్లలో అర్లీకెల్లీ, కెప్టెన్ లారా దేలానీ చెరో మూడు; జానే మాగురీ రెండు వికెట్లు పడగొట్టారు.
గాబీ లూయీస్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ తో పాటు ప్లేయర్ అఫ్ ద సిరీస్ కూడా దక్కింది.