ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను. బాలయ్యతో ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ చిత్రాలను రూపొందించడం.. ఈ మూడు చిత్రాలు ఒకదానిని మించి మరొకటి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించడంతో బోయపాటి సినిమా అంటే… యాక్షన్ అదిరిపోయే రేంజ్ లో ఉంటుందనే నమ్మకం అందరిలో ఏర్పడింది. అఖండ బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ తో బోయపాటి భారీ చిత్రం చేస్తున్నారు. ఇది అటు రామ్, ఇటు బోయపాటి ఇద్దరికీ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. దీంతో అసలు ఈ కథ ఏంటి..? రామ్ ను ఎలా చూపించనున్నారు అనేది ఆసక్తిగా మారింది.
ఈ మూవీ గురించి లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే…. బోయపాటి కి పొలిటికల్ డ్రామాలు బాగా కలిసొచ్చాయి. లెజెండ్, సరైనోడు.. ఇవి రెండూ ఓరకంగా పొలిటికల్ డ్రామాలే. అందుకనే రామ్ తో సినిమాను కూడా పొలిటికల్ డ్రామానే చేయాలి అనుకున్నారట. ఇది కూడా పూర్తి స్థాయిలో రాజకీయ నేపథ్యాల్లో సాగే కథ అని తెలుస్తోంది. రామ్ కి ఈ తరహా సినిమా చేయడం ఇదే తొలిసారి. ప్రస్తుత సమకాలీన రాజకీయాలు, జనం తరచూ మాట్లాడుకొనే రకరకాల రాజకీయ వ్యవహారాలు, సంఘటనలు…. ఇవన్నీ ఈ సినిమాలో కనిపించబోతున్నాయట.
ఈ సినిమాలో పొలిటికల్ పంచ్‌లు ఓ రేంజ్లో ఉండబోతున్నాయని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఓ ప్రత్యేకమైన పాత్రలో నందమూరి బాలకృష్ణ కనిపించనున్నారని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. దీని పై బోయపాటి శ్రీను ఇప్పటి వరకూ నోరు మెదపలేదు. బాలీవుడ్ ఐటెమ్ సోయగం ఊర్వశి రౌటాలా ఓ ప్రత్యేక గీతంలో కనిపించనుంది. ఇటీవలే.. ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ను తెరకెక్కించారు. మరి.. ఈ పొలిటికల్ డ్రామాతో రామ్ ఎంత వరకు మెప్పిస్తారో చూడాలి.