హర్మన్ ప్రీత్ సింగ్ నేతృత్వంలోని భారత పురుషుల హాకీ జట్టు ఆస్ట్రేలియా టూర్ కోసం బెంగుళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అడిలైడ్ బయలుదేరింది. ఆసీస్ జట్టుతో ఐదు మ్యాచ్ ల సిరీస్ ఇండియా ఆడనుంది. జనవరిలో ఓడిషాలో జరగనున్న హాకీ ప్రపంచ కప్ ముందు సన్నాహకంగా ఈ టూర్ ఉపయోగపడుతుందని కెప్టెన్ హర్మన్ ప్రీత్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
జనవరి 13 నుంచి 29 వరకూ ఓడిశాలోని కళింగ స్టేడియం తో పాటు, రూర్కెలాలో నూతనంగా నిర్మించిన బిర్సా ముండా అంతర్జాతీయ హాకీ స్టేడియం వేదికలుగా ఫెడరేషన్ అఫ్ ఇంటర్నేషనల్ హాకీ (ఎఫ్ఐహెచ్) ఆధ్వర్యంలో ఈ వరల్డ్ కప్ టోర్నమెంట్ జరగనుంది.
ప్రస్తుత ర్యాంకింగ్స్ లో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోన్న ఆసీస్ తో జరిగే ఈ మ్యాచ్ లో తమ జట్టు సామర్ధ్యానికి ఓ లిట్మస్ టెస్ట్ గా ఉపయోగపడతాయని, ఏయే అంశాల్లో తమ ఆటతీరు మెరుగు పర్చుకోవాలనే దానిపై ఓ అవగాహనకు వస్తామని హర్మన్ వెల్లడించారు. 2018లో జరిగిన గోల్డ్ కోస్ట్ కామన్ వెల్త్ గేమ్స్ తర్వాత ఆ దేశంలో పర్యటించలేదని, ఇప్పుడు అక్కడ ఆడేందుకు వెళ్ళడం ఎంతో ఉత్సుకత కలిగిస్తోందని చెప్పాడు.
అడిలైడ్ లోని మాటే స్టేడియంలోనే ఈ ఐదు మ్యాచ్ లూ జరగనున్నాయి. నవంబర్ 26న తొలి మ్యాచ్ జరుగుతుంది. ఆ తర్వాత నవంబర్ 27,30; డిసెంబర్ 3,4 తేదీల్లో మిగతావి జరగనున్నాయి.