ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన సొంత నియోజకవర్గం వారణాసిలో జూలై 15న పర్యటించనున్నారు. సిగ్రాలో ‘రుద్రాక్ష్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్’ను జాతికి అంకితం చేయనున్నారు. ఇండియా- జపాన్ స్నేహ సంబంధాలకు గుర్తుగా 186 కోట్ల రూపాయల వ్యయంతో రెండు దేశాల భాగస్వామ్యంతో ఈ కన్వెన్షన్ సెంటర్ నిర్మించారు. ఈ సెంటర్ ప్రారంభోత్సవంలో మోడితో పాటు ఇండియాలో జపాన్ రాయబారి, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనంది బెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, పలువురు కేంద్ర మంత్రులు కూడా పాల్గొంటారు. జపాన్ ప్రధాని యోషిహిదే సుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సందేశం ఇస్తారు.
దీనితోపాటు మొత్తం 736 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న 76 ప్రాజెక్టులకు అయన శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ప్రధానమంత్రి భద్రతా సిబ్బంది స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) నేటి సాయంత్రం వారణాసికి చేరుకోనుంది. యూపి సిఎం యోగి ఆదిత్యనాత్ ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్లపై, అయన ప్రారంభించనున్న ప్రాజెక్టులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. వారణాసికి ఒక ‘సీపెట్’ ను కూడా ప్రధాని మంజూరు చేయబోతున్నారు.
వచ్చే ఏడాది ఆరంభంలో కీలకమైన ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి, ఈ ఎన్నికల్లో తమ అధికారం నిలబెట్టుకోవాలని బిజెపి ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల జరిగిన కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళన కూడా ఈ రాష్ట్రం నుంచి ఎక్కువ మందికి అవకాశం కల్పించారు.