బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. తమ ఎదుట హాజరు కావాలంటూ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై ప్రభుత్వం నియమించిన సిట్ ఇచ్చిన 41 సిఆర్పీసీ నోటీసులపై డిసెంబర్ 5 వరకూ స్టే విధించింది. తనకు రెండోసారి సిట్ ఇచ్చిన నోటీసులను కొట్టివేయాలంటూ బిఎల్ సంతోష్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ప్రభుత్వ వాదన సరిగా లేదని అభిప్రాయపడింది. సంతోష్ తరఫున దేశాయ్ ప్రకాష్ రెడ్డి వాదనలు వినిపించారు. ఫిర్యాదులో సంతోష్ పేరు లేనప్పుడు నిందితుల జాబితాలో ఎలా చేరుస్తారని వాదించారు.
ఈ వ్యవహారంలో సంతోష్ ప్రమేయంపై పక్కా ఆధారాలున్నాయని, ఎఫ్ఐఆర్ నమోదు కూడా పూర్తయ్యిందని కోర్టుకు ప్రభుత్వ న్యాయవాది తెలియజేశారు. సంతోష్ విచారణకు హాజరయితే మరిన్ని ఆధారాలు లభించే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఇరు పక్షాల వాదనలనూ విన్న న్యాయస్థానం డిసెంబర్ 5 నాటికి తదుపరి విచారణ వాయిదా వేస్తూ అప్పటి వరకూ సంతోష్ పై ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని తీర్పు చెప్పింది.