Thursday, April 18, 2024
HomeTrending Newsబిజెపి సభ్యత్వం తీసుకున్న మర్రి

బిజెపి సభ్యత్వం తీసుకున్న మర్రి

కాంగ్రెస్ పార్టీ  సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి భారతీయ జనతాపార్టీలో చేరారు. ఢిల్లీ లోని బిజెపి ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రి శర్బానంద్ సోనోవాల్  చేతుల మీదుగా ఆయన ఆ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్య సభ సభ్యుడు డా. కె. లక్ష్మణ్, బిజెపి తెలంగాణా అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, ఎంపి ధర్మపురి అరవింద్, డా. వివేక్, డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మర్రి శశిధర్ రెడ్డి నీతి, నిజయతీతో… కాంగ్రెస్ పార్టీ కోసం చిత్తశుద్ధితో పని చేశారని, మచ్చలేని, స్వచ్చమైన నేత బిజెపిలో చేరడం సంతోషంగా ఉందని కిషన్ రెడ్డి అన్నారు. ఆయన చేరిక పార్టీకి బలాన్ని, ధైర్యాన్ని చేకూరుస్తుందన్నారు. తెలంగాణాలో  కల్వకుంట్ల కుటుంబ, అనివీతి పరిపాలన బిజేపితోనే అంతమవుతుందని అందరూ నమ్ముతున్నారని, అందుకే నేతలు బిజెపిలో చేరేందుకు సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు.  టిఆర్ఎస్ బరితెగించి  అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, నిస్సిగ్గుగా మాట్లాడుతోదని ఆరోపించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని, టిఆర్ఎస్ ను ఎదుర్కొనే శక్తి ఆ పార్టీకి లేదని శశిధర్ రెడ్డి వ్యాఖ్యానించారు.  ఏ లక్ష్యంకోసం  ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యిందో ఆ ఆశలు నెరవేరలేదని, అభివృద్ధి నిలిచిపోయిందని అన్నారు.  దేశంలోనే ఇంతటి అవినీతి ప్రభుత్వం మరే రాష్ట్రంలోనూ లేదన్నారు. కుటుంబ పాలనను అంతం చేసే సత్తా బిజెపికి మాత్రమే ఉందని, సేనియర్ నాయకులు అందరితో  కలిసి పనిచేసి బిజెపిని అధికారంలోకి తీసుకు వస్తామని ధీమా వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్