Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

IT Raids: అది చీమలు దూరని చిట్టడివి. కాకులు దూరని కారడవి. మనుషులు దూరని మహారణ్యం. పిల్లలమర్రికి పదింతలున్న మర్రి చెట్టు కింద కౄర మృగాలు, అకౄర మృగాలు, పక్షులు, అక్కు పక్షులు, అపక్షులు, విపక్షులు, సపక్షులు, సరీసృపాలు అన్నీ అత్యవసర విస్తృత స్థాయి జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకున్నాయి. మీటింగ్ అజెండా ముందే అందరికీ వాట్సాప్ , మెయిళ్ళలో వెళ్లింది. విషయ గాంభీర్యం వల్ల గాలికి ఎండుటాకు కదిలినా స్పష్టంగా వినిపించేంత మౌనం.

అక్కడున్న రాళ్లల్లో పెద్ద రాయి మీదికి ఎక్కి జూలు విదల్చకుండా సింహం లోగొంతుకతో అధ్యక్షోపన్యాసం మొదలు పెట్టింది.

“నేను జనరల్ గా ఇలాంటి జనరల్ బాడీ మీటింగులకు వ్యతిరేకం. అందరినీ పిలిచి మాట్లాడే అవసరం నాకు లేదు. మీరే అందరూ కట్టగట్టుకుని వచ్చారు కాబట్టి మాట్లాడక తప్పడం లేదు. నేను చెప్పింది వినడం తప్ప మీకు మరో అప్షన్ ఉండదు.

మొన్న మధ్యాహ్నం నా భార్య చంపగా నేను వెళ్లి మాంసం తింటుండగా తోడేళ్లు, వేటకుక్కలు, అడవి పందులు, కాకులు, గద్దలు ఒక్కసారిగా నా చుట్టూ చేరాయి. నేను తిని వెళితే ఎంగిలి మాంసం తినడానికి ఎప్పుడూ వచ్చినట్లే వచ్చి ఉంటాయిలే అనుకుని…రక్తమోడే పది కేజీల ఫ్రెష్ మాంసం స్నాక్స్ లా తిని నా మానాన నేను వచ్చేశాను. సింహావలోకనంగా ఒక్కోసారి వెనక్కు తిరిగితే అవన్నీ నా వెనకే వస్తున్నాయి. అప్పుడు అర్థమయ్యింది. అవి ఎంగిలి మాంసం కోసం రాలేదని. ఏమిటని కనుసైగతో అడిగితే…అన్నీ ఒక్కసారిగా గొల్లుమని ఏడ్చాయి. ఇతరులను ఏడిపించడం తప్ప ఏడ్చి ఎరుగని నా కంట్లో తొలిసారి జలజలా నీళ్లు కారిపోయాయి. ఎంత నేను టిఫిన్ గా తిన్న జంతువులయినా…అవి కూడా ప్రాణులే కదా! వాటికీ మనసుంది. ఆత్మాభిమానం ఉంటుంది కదా! ఏడుస్తూ అవి నాతో చెప్పుకున్న బాధలో ఔచిత్యం, ఆవేదన, అస్తిత్వ పోరాటం ఉన్నాయనిపించి ఈ ప్రత్యేక జెనరల్ బాడీ మీటింగ్ కాల్ ఫార్ చేశాను.

దేశంలో ఎక్కడ ఇన్ కమ్ ట్యాక్స్, సి బి ఐ, ఈ డి రైడ్లు జరిగినా-
1. వేట కుక్కల్లా వెంట పడ్డారు
2. తోడేళ్లలా మీద పడ్డారు
3. గుంట నక్కల్లా కాచుకుని వచ్చారు
4. అడవి పందుల్లా విచక్షణారహితంగా వ్యవహరించారు.
5. కాకుల్లా పొడుచుకు తిన్నారు.
6. గద్దల్లా వాలారు.

అని పదే పదే మన సహచర జంతువులను, పక్షులను ఘోరంగా అవమానిస్తున్నారు.

ఈ మాటల అవమానభారంతో ఏడ్చి ఏడ్చి గుంట నక్కల కళ్లు గుంతలోకి దిగిపోయాయి. వేటకుక్కలు వేట మానేసి వెక్కి వెక్కి ఏడుస్తున్నాయి. తోడేళ్లు తోడులేని అక్కు పక్షులై దిక్కుతోచక ఏడుస్తున్నాయి. కాకులు పిండం తినడం మానేసి గండం బయటపడే మార్గం కోసం దిగులు దిగులుగా దిక్కులు చూస్తున్నాయి. గద్దలు మిద్దెల మీద వాలడం మానేసి పైపైనే తిరుగుతూ నిద్రాహారాలు మాని నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఆది వరాహపు అడవి పందుల ఆత్మాభిమానం దెబ్బతిని బురద కనపడినా దొర్లకుండా మనుషుల్లా ప్రవర్తిస్తున్నాయి.

దీన్నిలాగే వదిలేస్తే-
సింహం సింగిల్ గా వచ్చినా…గుంపులుగా వచ్చినా…
అని నన్ను కూడా లెక్క చేయని రోజులు వచ్చే ప్రమాదం ఉంది.

పార్లమెంటరీ వ్యవస్థలో భాగమయిన మనం మేల్కోవాల్సిన తక్షణ ప్రజాస్వామిక ప్రమాద ఘంటిక మోగుతోంది. ఇకపై రైడ్ల సందర్భంలో వేటకుక్కలు, తోడేళ్ళు, కాకులు, గద్దలు, దున్నపోతులు అనడాన్ని నిషేధించాలని ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానిస్తోంది. మన తీర్మానాన్ని ఉల్లఘించిన వారిమీద భౌతికదాడులు చేసి…తగిన దేహశుద్ధి గుణపాఠం చెప్పే ఆటవిక న్యాయ ఇమ్యూనిటీ ఎలాగూ మనకుంది.

ఒక్కసారిగా కరతాళధ్వనులతో అడవి ఆకాశానికి చిల్లులు పడింది.

బ్యాగ్రౌండ్లో ఆడియో మొదలయ్యింది.

దాక్కో దాక్కో మేక…
పులొచ్చి కొరుకుద్ది పీక…

తగ్గేదే ల్యా!

అడవి జంతువుల ఆనంద నర్తనంతో భూమి వణుకుతోంది.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

భాష గాలిలో దీపం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com