రైతులకు ప్రభుత్వం అందిస్తోన్న వివిధ పథకాలకు సంబంధించి 200 కోట్ల రూపాయల సాయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు వారి అకౌంట్లలో జమ చేయనున్నారు. ఇన్‌పుట్ సబ్సిడీ, వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల వడ్డీ రాయితీ సొమ్ముతో పాటు, గతంలో వివిధ సాంకేతిక కారణాల వల్ల చెల్లింపులు పొందని వారికి నేడు సిఎం క్యాంప్ కార్యాలయం నుండి బటన్ నొక్కి నేరుగా రైతన్నల ఖాతాల్లో జమ చేయనున్నారు.
ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్ ముగిసేలోగానే నష్టపరిహారం చెల్లిస్తామన్న మాట మరోసారి నిలబెట్టుకుంటూ 2022 జులై – అక్టోబర్ మధ్య (ఖరీఫ్‌లో) కురిసిన అధిక వర్షాలు, వరదలకు పంట నష్టపోయిన 45,998 మంది వ్యవసాయ, ఉద్యానవన రైతన్నలకు రూ. 39.39 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని ఖరీఫ్ 2022 ముగియక ముందే నేడు నేరుగా వారి ఖాతాల్లో వేయనున్నారు.
వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలకింద రబీ 2020-21, ఖరీఫ్ 2021లో రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన 8,22,411 మంది రైతన్నలకు రూ. 160.55 కోట్ల వడ్డీ రాయితీ సొమ్మును వారి ఖాతాల్లో నేడు తిరిగి చెల్లించనున్నారు.
గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు రూ. 1,180 కోట్లు, నేడు అందిస్తున్న రూ. 160.55 కోట్లతో కలిపి శ్రీ వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల క్రింద 73.88 లక్షల మంది రైతన్నలకు అందించిన వడ్డీ రాయితీ రూ. 1,834.55 కోట్లు.
మూడేళ్ళ ఐదు నెలల్లో వివిధ పథకాల క్రింద రైతన్నలకు అందించిన సాయం రూ. 1,37,975.48 కోట్లు అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించారు.