Friday, June 12, 2026
HomeTrending Newsగ్రానైట్ వ్యవహారంలో మంత్రి గంగులకు కష్టాలు

గ్రానైట్ వ్యవహారంలో మంత్రి గంగులకు కష్టాలు

గత కొద్దిరోజులుగా తెలంగాణ రాజకీయాలను ఈడీ, ఐటీ సోదాలు కుదిపేస్తున్నాయి. తాజాగా సీబీఐ బృందం ఈ రోజు (బుధవారం) మంత్రి గంగుల కమలాకర్ ఇంటికి ఓ బృందం వచ్చింది. కరీంనగర్ లోని ఆయన ఇంటికి వచ్చిన అధికారులు… కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చారు. మరోవైపు మంత్రి గంగుల ఇవాళ ఉదయమే కరీంనగర్ నుంచి హైదరాబాద్ కు వెళ్లారు. మంత్రి లేకపోవటంతో ఆయన కుటుంబ సభ్యులకు అధికారులు నోటీసులు ఇచ్చారు. రేపు ఢిల్లీలో విచారణకు హాజరు కావాలని తెలిపినట్లు సమాచారం. అయితే ఏ కేసులో మంత్రికి నోటీసులు ఇచ్చారనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఈ మధ్య ఆయనపై ఈడీ,  ఐటీ సోదాలు జరిగాయి. గ్రానైట్ వ్యవహారంపై విచారించాయి. పలు డాక్యూమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ సోదాలు.. చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

గ్రానైట్ వ్యవహారంలో కొన్ని సంవత్సరాలుగా మంత్రిపై ఆరోపణలు ఉన్నాయి. మంత్రి గంగుల కమలాకర్ కనుసన్నల్లోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ తవ్వకాల అనుమతులు, ఒప్పందాలు జరుగుతాయని జిల్లాలో నానుడి. గనుల శాఖ అధికారులు మంత్రి మాట జవదాటరు అనే ఆరోపణలు ఉన్నాయి. గ్రానైట్ వ్యవహారాలు చక్కదిద్దుకునేందుకే అప్పట్లో గంగుల.. గులాబీ తీర్థం తీసుకున్నారని… తెరాస లో చేరాక ఆయనకు అడ్డు అదుపు లేకుండా పోయిందని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

అయితే ఇప్పుడు సీబీఐ ఎంట్రీ ఇవ్వటంపై…మంత్రి గంగులకు కష్టాలు మొదలయ్యాయని గ్రానైట్ పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. అయితే ఈ వ్యవహారంలో మరో అంశం తెరపైకి వస్తోంది. గతంలో విశాఖకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి నకిలీ సీబీఐ పేరుతో అక్రమాలకు పాల్పడ్డాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న సీబీఐ బృందం దర్యాప్తు చేస్తోంది. అయితే ఇటీవల కాపు సమ్మేళనంలో మంత్రి గంగుల కమలాకర్ తో ఫొటోలు దిగాడు శ్రీనివాస్. వీటిని సీబీఐ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మంత్రి గంగులకు ఏమైనా నోటీసులు ఇచ్చారా..? లేక మరేదైనా కేసులో విచారించనున్నారా అనేది ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉంటే ఈ మధ్యే సీబీఐ విషయంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో సీబీఐ దర్యాప్తుకు అనుమతులు నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులు రాష్ట్ర మంత్రికి నోటీసులు ఇవ్వటం సంచలనం సృష్టిస్తోంది. మరీ ఈ నోటీసులపై మంత్రి గంగుల ఎలా స్పందిస్తారనేది చూడాలి.

Also Read : కరీంనగర్‌లో ఐటీ, ఈడీ సోదాలు టార్గెట్ మంత్రి గంగుల

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular