Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

విపక్షాలకు కొరవడిన ఆలోచనా శక్తిని, వివేకాన్ని ఇవ్వాలని…. పేదల పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవడానికి వీల్లేదని వాదించే మనుషుల సంస్కారాలు మారాలని…. నావారు మాత్రమే బాగుపడాలని కోరుకునే మనస్తత్వం నుంచి మనుషులంతా ఒక్కటే అన్న మానవతావాదంతో కూడిన జ్ఞానం కలగాలని దేవుణ్ణి ప్రార్ధిస్తున్నట్లు  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగిన కార్యక్రమంలో జగనన్న విద్యాదీవెన పథకం మూడో విడత సాయాన్ని విద్యార్ధుల తల్లుల అకౌంట్లలో జమ చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. ఫలానా ప్రాంతంలో, ఫలానా పొలాల్లో, ఫలానా రేటుకు తమ భూములు అమ్ముకునేందుకు మాత్రమే ఓ రాజధాని కట్టాలన్న ఆలోచన నుంచి బైటపడేలా కూడా విపక్షాలకు జ్ఞానాన్ని, బుద్ధిని ఇవ్వాలని ఆకాంక్షించారు.

అధికారంలో ఉన్నప్పుడు  రైతులను మోసం చేసిన చంద్రబాబు వ్యవసాయం గురించి మాట్లాడుతున్నారని…. పిల్లలకు అన్యాయం చేసిన బాబు విద్య గురించి…. అక్క చెల్లెమ్మలకు ద్రోహం, దగా చేసిన బాబు మహిళా సాధికారత గురించి…. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అవమానించి, అన్యాయం చేసిన బాబు  ఇప్పుడు సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నారని… ఆయన్ను చూసిన ప్రజలు మాత్రం ఇదేమి ఖర్మరా బాబూ అనుకుంటున్నారని జగన్ ఎద్దేవా చేశారు.

కుళ్ళిపోయిన పెత్తందారీ మనస్తత్వం ఉన్న ఇలాంటి బాబులు, దత్తపుత్రులు, కొన్ని మీడియా సంస్థలను… వారు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని పిలుపు ఇచ్చారు.  మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అన్నదే కొలమానంగా తీసుకోవాలని, మంచి జరిగితే తనకు తోడుగా ఉండాలని కోరారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా విద్యార్ధులకు ఫీజు రీ ఇంబర్స్ మెంట్ పథకాన్ని నాడు వైఎస్ఆర్ తీసుకువచ్చారని, కానీ గత ప్రభుత్వాలు అరకొర నిధులు మాత్రమే కేటాయించి దీన్ని నిర్వీర్యం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు.  మళ్ళీ తాము అధికారంలోకి వచ్చిన తరువాత వంద శాతం ఫీజులను చెల్లిస్తూ ‘జగనన్న విద్యా దీవెన’ తీసుకువచ్చామన్నారు.

విద్యార్ధుల కోసం ఖర్చు చేసే ప్రతి రూపాయినీ తాను ఓ ఖర్చులా భావించనని, దాన్ని వారికి అందిస్తున్న  ఆస్తి లాగే అనుకుంటానని  చెప్పారు. ప్రతి విద్యార్థి చక్కగా చదువుకోవాలని వారి చదువుకు తాను పూచీగా ఉంటానని భరోసా ఇచ్చారు.  జవాబుదారీతనాన్ని పెంచేందుకే ఈ నిధులను తల్లుల అకౌంటల్లో జమ చేస్తున్నామని… ప్రతి విద్యార్ధి గొప్పగా చదువుకోవాలని  సిఎం జగన్ ఆకాంక్షించారు. అక్షరాలూ రాయడం, చదవడం మాత్రమే విద్యకు పరమార్ధం కాదు, తనకు తానుగా ప్రతి పాప, బాబు అలోచించి నిర్ణయాలు తీసుకోగలిగే శక్తి ఇవ్వలగలగడమే విద్యకు పరమార్ధం అంటూ ఆల్బర్ట్ ఐన్ స్టీన్ చెప్పిన విషయాన్ని సిఎం గుర్తు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com