ప్రతిపక్ష నేత చంద్రబాబు పద్దతిగా మాట్లాడాలని, నాలుక అదుపులో ఉంచుకోవాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో చంద్రబాబు తనపై చేసిన వ్యాఖ్యలపై అంబటి నిప్పులు చెరిగారు. 1975 నుంచి బాబు చరిత్ర ఎంతో తనకు బాగా తెలుసనీ, ఆయన్ను దగ్గరి నుంచి పరిశీలిస్తున్నానని, సంజయ్ గాంధీ దగ్గర బాబు ఎన్ని బ్రోకర్ పనులు చేశాడో తన దగ్గర చిట్టా ఉందని వ్యాఖ్యానించారు. ఒక్క నిమిషం తన సంస్కారం పక్కన పెట్టి మాట్లాడితే చంద్రబాబు ఉరి వేసుకోవాల్సి ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై ఇలాగే మాట్లాడితే అన్ని విషయాలూ బైట పెడతానన్నారు. ‘నీ చెంచాలు, గొట్టంగాళ్ళు మాట్లాడితే ఏదో పోనీలే అని వూరుకున్నా, కానీ నువ్వే ఇలా మాట్లాడితే తగిన రీతిలో స్పందిస్తా’నని బాబుకు వార్నింగ్ ఇచ్చారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి మీడియాతో మాట్లాదారు.
చివరి ఛాన్స్ అంటూ చంద్రబాబు ప్రజలను ప్రాధేయపడాల్సిన ఖర్మ బాబుకు పట్టిందని, తాము అధికారంలోకి వస్తే పథకాలన్నీ కొనసాగిస్తానని బాబు చెబుతున్నారని.. అంటే జగన్ ప్రవేశ పెట్టినవి అద్భుతమైన పథకాలని ఒప్పుకున్నట్లు కాదా అని ప్రశ్నించారు. బాబుకు ధైర్యం ఉంటే జగన్ తరహా పాలన అందిస్తానని చెప్పుకోవచ్చుగా అని ఎద్దేవా చేశారు. గతంలో ఎలాంటి పాలన అందిస్తానో ఆ తరహా పాలన అందిస్తానని ప్రజలను ఓటు అడిగే దమ్ము బాబుకు లేదని మండిపడ్డారు. జగన్ లాగా పరిపాలన చేస్తానని చేయడానికి నువ్వెందుకు అంటూ సూటిగా నిలదీశారు.
ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి అని పేరు పెట్టారని కానీ దీనికి ఇదేం ఖర్మ చంద్రబాబుకు, ఇదేం ఖర్మ తెలుగుదేశం పార్టీకి అని పేరు పెట్టుకోవాల్సిందని రాంబాబు ఎద్దేవా చేశారు. గతంలో బాదుడే బాదుడు కార్యక్రమం పెట్టారని, కానీ టిడిపి నేతలు ఎక్కడా దీనిలో పాల్గొనలేదన్నారు. వివేకాహత్య కేసులో విచారణ జరుగుతోందని, దీనిపై బాబు, ఆ పార్టీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఈ కేసు ద్వారా జగన్ ను బద్నాం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
Also Read : Babu: తాటాకు చప్పుళ్ళకు భయపడం: చంద్రబాబు