ఉక్రెయిన్ – రష్యా యుద్ధం అమెరికా, యూరోప్ దేశాల ఆంక్షలతో భారతదేశానికి రష్యా డిస్కౌంట్‌కు ముడిచమురును అందిస్తున్నది. దీనిపై అంతర్జాతీయంగా విమర్శలు వచ్చినా భారత్ పట్టించుకోలేదు. దేశ ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని భారత్ తెగేసి చెప్పింది. ఈ అంశంపై పాకిస్తాన్ లో చర్చోపచర్చలు జరిగాయి. భారత్ విదేశాంగ విధానాన్ని మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా కొనియాడారు. ఈ నేపథ్యంలో ప్రధాని షాబాజ్ షరీఫ్ రష్యా నుంచి తక్కువ రేటుకే చమురు సాధించాలనే ప్రయత్నాలు మొదలు పెట్టారు. అమెరికా ఒత్తిడికి తలొగ్గి ఇన్నాళ్ళు వేచి చుసిన పాక్.. దేశంలో నిత్యావసరాల ధరల మోత భరించలేక ముందుకు కదిలింది. చమురు కోసం చర్చలు జరిపిందుకు పాకిస్థాన్ పాలకులు.. అనుకున్నదే తడవుగా ఆ దేశ మంత్రి,, మాస్కో వెళ్లారు. 30 నుంచి 40 శాతం డిస్కౌంట్‌తో తమకు చమురు సప్లయ్ చేయాలని కోరారు. అయితే వారి అభ్యర్ధనను అక్కడి అధికారులు తిరస్కరించారు. దీంతో రిక్త హస్తాలతో స్వదేశానికి తిరుగుపయణమవ్వడం ఆయన వంతయ్యింది.
పాక్ పెట్రోలియం శాఖ మంత్రి ముసాదిక్ మాలిక్ నేతృత్వంలోని అధికారుల బృంధం.. ముడిచమురు ధర తగ్గించడంతోపాటు రవాణా ఖర్చులు, దిగుమతి చేసుకునే అవకాశాలను గురించి చర్చించేందుకు నవంబర్ 29న మాస్కోలో పర్యటించారు. మాస్కోలోని తమ రాయబార కార్యాలయ అధికారులతో కలిసి రష్యన్ అధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమకు తగ్గింపు ధరకు చమురు ఇవ్వాలని కోరారు. అయితే పాక్ ప్రతిపాదనను రష్యా అధికారులు తిరస్కరించారు.
ఉక్రెయిన్, రష్యా యుద్ధం నేపథ్యంలో ఈయూ దేశాలతోపాటు ఇతర పాశ్చాత్య దేశాలు రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేయకుండా ఆంక్షలు విధించాయి. దీంతో సహజ మిత్రదేశమైన భారత్‌కు డిస్కౌంట్‌పై ముడిచమురును అందించడానికి రష్యా ముందుకువచ్చింది. అప్పటి నుంచి భారత్ తక్కువ ధరకే రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంటున్నది.