నేటి ఉదయం మరణించిన యశ్ పాల్ శర్మ మృతికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది. బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ యశ్ పాల్ మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భారత క్రికెట్ ఒక హీరో ను కోల్పోయిందని తన సందేశంలో పేర్కొన్నారు. జట్టులో మిడిలార్డర్ బ్యాట్స్ మాన్ గా, గొప్ప ఫీల్డర్ గా అయన సేవలందించారని గంగూలీ గుర్తు చేసుకున్నారు. భారత క్రికెట్ జట్టుకు అయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు.
1983 వరల్డ్ కప్ లో అయన ఆటతీరు ఎప్పటికీ గుర్తుండిపోతుందని బిసిసిఐ కార్యదర్శి జై షా కొనియాడారు. నాటి విజయంలో అయన నిర్మాణాత్మక పాత్ర పోస్చిచారని గుర్ట్టు చేసుకున్నారు. భారత క్రికెట్ కు అయన అందించిన సేవలు నిరుపమానమని జై షా శ్లాఘించారు. అయన ఆత్మకు శాంతి చేకూర్చాలని, కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు. ఈ మేరకు అయన ఓ ప్రకటన విడుదల చేశారు.
యశ్ పాల్ శర్మ తన అంతర్జాతీయ కెరీర్ లో మొత్తం 37 టెస్టులు, 42 వన్డే మ్యాచ్ లు ఆడి మొత్తం 2,489 పరుగులు చేశారు. వీటిలో 2 సెంచరీలు, 13 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 160 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడి 8,933 పరుగులు చేశారు. 2004 నుంచి 2005; 2008 నుంచి 2011 కాలంలో జాతీయ క్రికెట్ జట్టు సెలెక్టర్ గా కూడా సేవలందించారు. గుండెపోటుతో నేటి ఉదయం అయన మరణించారు.