పంజాబ్‌లోని భారత్-పాక్ సరిహద్దుల్లో మరోసారి డ్రోన్ కలకలం సృష్టించింది. అమృత్‌సర్ జిల్లా రజతల్ గ్రామం బీఎస్‌ఎఫ్ బలగాలు అక్రమ డ్రోన్‌ను గుర్తించాయి. సరిహద్దుల్లో గస్తీ నిర్వహిస్తున్న బీఎస్‌ఎఫ్ జవాన్లు ఆదివారం రాత్రి 7.40 గంటల సమయంలో పాకిస్థాన్ నుంచి భారత భూభాగంలోకి ఎగురుతూ వస్తున్న డ్రోన్‌ను గుర్తించాని అధికారులు తెలిపారు. దానిని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. అది ఏవైనా వస్తువులను తీసుకొచ్చిందా అనే కోణంలో ఆ ప్రాంతంలో గాలిస్తున్నామని చెప్పారు.
భారత్, పాక్ సరిహద్దు ప్రాంతాల్లో తరచూ డ్రోన్లు కనిపిస్తున్నాయి. పాక్ మూకలు.. డ్రోన్ల సాయంతో భారత్‌లోకి ఆయుధాలు, డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నారు. గత శుక్రవారం అమృత్‌సర్ సెక్టార్‌లోని సరిహద్దుల్లో పాక్ వైపు ఉంచి వచ్చిన డ్రోన్‌ను కూల్చివేశారు. ఇలా గత బుధ, గురువారాల్లో కూడా బీఎస్‌ఎఫ్ జవాన్లు డ్రోన్లను పడగొట్టారు. ఈ నేపథ్యంలో శత్రుదేశం నుంచి వచ్చే డ్రోన్‌ల ఆటకట్టించేందుకు భారత సైన్యం గద్దలకు ప్రత్యేక ట్రైనింగ్ ఇస్తున్నది. వీటిసాయంతో డ్రోన్‌లను గాల్లోనే ధ్వంసం చేయనున్నారు.