ప్రభుత్వ వైఫల్యం వల్లే కందుకూరు ఘటన జరిగిందని ఎమ్మెల్యే డా. డోలా బాల వీరాంజనేయ స్వామి ఆరోపించారు. జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న చంద్రబాబు పర్యటనకు వస్తుంటే పోలీసు యంత్రాంగం కనీస భద్రతా చర్యలు చేపట్టలేదని, ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. ఘటన జరిగిన తరువాత కూడా యంత్రాంగం స్పందించిన తీరు సరిగా లేదని, పోలీసులు ఎవరూ సహాయక చర్యల్లో పాల్గొనలేదని, కార్యకర్తలే వారిని హుటాహుటిన ఆస్పత్రులకు తీసుకు వెళ్ళారని చెప్పారు.
కాగా, ప్రమాద ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2లక్షల రూపాయల ఆర్ధిక సాయం ప్రకటించారు. గాయపడిన వారికి 50 వేల రూపాయలు అందిస్తామని హామీ ఇచ్చారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ప్రమాడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏ పార్టీకైనా కార్యకర్తలే వెన్ను దన్ను అని, అలాంటి కార్యకర్తలు ఇలా ప్రమాదం బారిన పడి మరణించడం బాధాకరమని ఆయన ఓ ప్రకటనలో వెల్లడించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని పవన్ ఆకాంక్షించారు.