Tuesday, April 16, 2024
HomeTrending Newsఏప్రిల్ 3 నుంచి పదవ తరగతి పరీక్షలు

ఏప్రిల్ 3 నుంచి పదవ తరగతి పరీక్షలు

పదవ తరగతి పరీక్షలను ఏప్రిల్ 3 వ తేది నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను విడుదల చేయాలని ప్రభుత్వ పరీక్షల సంచాలకులను ఆదేశించారు. పదో తరగతి బోర్డు పరీక్షలు ఆరు పేపర్లతోనే నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతీ పరీక్షకు మూడు గంటల సమయాన్ని కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. పదవ తరగతి పరీక్షల సన్నద్ధతపై మంత్రి సమీక్షించారు. వంద శాతం సిలబస్ తో పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపారు.పరీక్షల్లో వ్యాసరూప ప్రశ్నలకు మాత్రమే ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుందని, సూక్ష్మ రూప ప్రశ్నలకు ఛాయిస్ లేదని వెల్లడించారు. ఇందుకు సంబంధించి నమూనా ప్రశ్నా పత్రాలను వెంటనే విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

పదవ తరగతి పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహించాలని, వీటికి సంబంధించి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని అధికారులకు సూచించారు. సెలవు దినాల్లో కూడా ప్రత్యేక తరగతులను నిర్వహించాలని పేర్కొన్నారు. ఏదైనా సబ్జెక్టులో వెనుకబడిన వారిని గుర్తించి వారికి ప్రత్యేక బోధన చేయాలని సూచించారు. ఫిబ్రవరి, మార్చి మాసాల్లో ఫ్రీ ఫైనల్ పరీక్షలను నిర్వహించాలని సూచించారు. ప్రయివేట్ పాఠశాలలకు ధీటుగా ఉత్తీర్ణత శాతం సాధించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యా సంచాలకులు శ్రీ దేవసేన, ప్రభుత్వ పరీక్షల సంచాలకులు కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్