ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఫాంలోకి వచ్చాడు. ఇంగ్లాండ్ లో సర్రే- సోమర్ సెట్ మధ్య జరుగుతున్న ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ లో సర్రే కు ప్రాతినిధ్యం వహిస్తోన్న అశ్విన్ రెండో ఇన్నింగ్స్ లో 15 ఓవర్లు బౌలింగ్ చేసిన కేవలం 27 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు సాధించాడు. మొదటి ఇన్నింగ్స్ లో కేవలం ఒక వికెట్ మాత్రమే సాధించిన అశ్విన్ రెండో ఇన్నింగ్స్ లో సత్తా చాటాడు. లండన్ లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో జరుగుతున్న ఈ నాలుగు రోజుల మ్యాచ్ లో ఆఖరి రోజు అశ్విన్ బంతితో తన పవర్ ఏమిటో చూపించాడు.
సోమర్సెట్ తన మొదటి ఇన్నింగ్స్ లో 429 పరుగులు చేసింది, సర్రే మొదటి ఇన్నింగ్స్ లో 240 పరుగులు మాత్రమే చేయగలిగింది. సోమర్సెట్ రెండో ఇన్నింగ్స్ లో అశ్విన్ దెబ్బకు 69 పరుగులకే ఆలౌట్ అయ్యింది. సర్రే రెండో ఇన్నింగ్స్ లో టీ విరామానికి మూడు వికెట్లు కోల్పోయి 79 పరుగులు చేయగలిగింది. ఇంకా 180 పరుగులు చేయాల్సి ఉంది. అయితే మ్యాచ్ చివరిరోజు కావడంతో మ్యాచ్ డ్రా గా ముగిసే అవకాశం ఉంది.
ఇంగ్లాండ్- ఇండియా జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరగనుంది, మొదటి టెస్ట్ ఆగస్ట్ 4న ప్రారంభం కానుంది. కోవిడ్ కారణంగా ఇండియా జట్టు ఫస్ట్ క్లాస్ జట్టుతో ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడే అవకాశం లభించలేదు, అయితే అంతకు ముందే సర్రే జట్టుకు ఆడేందుకు అశ్విన్ ఒప్పందం చేసుకుని ఉండడంతో ఈ మ్యాచ్ లో ఆడే అవకాశం లభించింది.
ఇంగ్లాండ్ తో ఇండియా ఆడబోయే ఐదు టెస్టుల సిరీస్ కు మరో 20 రోజుల సమయం ఉన్న సమయంలో రవిచంద్రన్ అశ్విన్ ఫామ్ లోకి రావడం మంచి పరిణామం అని భారత క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.