కేరళలో మరో ఐదు జికా వైరస్ కేసులు వెలుగు చూశాయి. దీంతో జికా వైరస్ బారిన పడ్డ వారి సంఖ్య కేరళలో 28 కి చేరింది. తాజాగా బయట పడిన కేసులు తిరువనంతపురం సమీపంలోని అనయర నుంచి రెండు కేసులు కున్నుకుజ్జి, పత్తోం , ఈస్ట్ ఫోర్ట్ నుంచి ఒక కేసు చొప్పున వచ్చాయని కేరళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వీణ జార్జ్ వెల్లడించారు. జీకా వ్యాప్తికి కారణమవుతున్న దోమల నివారణకు ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ ఫోర్సు ఏర్పాటు చేసింది. రాజధాని తిరువనతపురంతో పాటు చుట్టూ పక్కల జిల్లాల్లో దోమల నివారణకు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.
రాబోయే వారం రోజులు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఫాగింగ్ ఇతర మార్గాల ద్వారా దోమల నివారణకు చర్యలు చేపట్టినట్టు మంత్రి తెలిపారు. తిరువనంతపురంకు మూడు కిలోమీటర్ల పరిధిలోనే కేసులు బయటపడటం కేరళ అధికార యంత్రాంగాన్ని కలవరపరుస్తోంది. ఈ నెల 9 వ తేదిన మొదటి కేసు వెలుగు చూడగా వారం రోజుల్లోనే 28 కి చేరటంతో రాష్ట్ర, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖలు అప్రమత్తమయ్యాయి.