దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లోని ఓ మురికివాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దక్షిణ సియోల్‌లోని గుర్యోంగ్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం 6:30గంటల ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగాయి. భారీగా మంటలు చెలరేగటంతో పాటు.. పొగ ఎక్కువగా వ్యాపించి సియోల్ నగరాన్ని మబ్బులు కమ్మేసినట్టుగా మారింది. సమాచారం అందుకున్న వెంటనే దాదాపు 290 మంది అగ్నిమాపక సిబ్బంది, 10 హెలికాఫ్టర్లు, పోలీసు యంత్రాంగం రంగంలోకి దిగి.. మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నించారు.
సియోల్ మురికివాడలో అగ్నిప్రమాదం
ఆ ప్రాంతంలో సుమారు 660కి పైగా కుటుంబాలు నివాసం ఉంటున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో దాదాపు 40 ఇళ్లు పూర్తిగా దగ్ధమైనట్లు తెలిపారు. సుమారు 500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. అయితే ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.