India origin Justin Narayan wins MasterChef Australia Winner 13 :
అప్పుడప్పుడే టీనేజ్ లో ప్రవేశిస్తున్న 13 ఏళ్ళ పిల్లవాడు ఎలా ఉంటాడు? తరచుగా మారే మూడ్ స్వింగ్స్ తో, చికాకుగా అనుకుంటున్నారా? లేదా ఆటపాటల్లో ఫ్రెండ్స్ తో తిరుగుతూ.. ఇది మనముందు సాధారణంగా కనిపించే దృశ్యం. అదే పిల్లవాడు వంటింట్లో అమ్మ చుట్టూ తిరుగుతూ, తాత, అమ్మమ్మలతో కలసి టీవీ చూస్తుంటే? నాలుగు తిట్టి అవతలికి పంపిస్తారు.
అయితే నారాయణ్ గురించి తెలిస్తే ఇకముందు అలా అనరు. ఆస్ట్రేలియా మాస్టర్ చెఫ్ పోటీల్లోఈ యువకుడు 1.86 కోట్లు గెలుచుకున్నాడు మరి. భారతీయ మూలాలుండి ఆస్ట్రేలియాలో స్థిరపడ్డ కుటుంబం జస్టిన్ నారాయణ్ ది. ఇద్దరు తమ్ముళ్లు. అమ్మ చేసే భారతీయ వంటకాలపై మక్కువ. తాత, అమ్మమ్మలతో కలసి టీవీలో వంటల ప్రోగ్రాములు చూస్తూ ప్రయోగాలు చేస్తూ ఉండేవాడు. 2017లో ఇండియా కు వచ్చినపుడు భారతీయ వంటకాలు మరింతగా తెలుసుకున్నాడు. తన వంటలు తిన్నవారు ఇచ్చే ప్రశంసలు ఇంకా కృషి చేసేందుకు తోడ్పడ్డాయి. అందుకే మాస్టర్స్ డిగ్రీ పక్కన పెట్టి మరీ మాస్టర్ చెఫ్ పోటీల్లో అడుగుపెట్టాడు.
ఆస్ట్రేలియన్ మాస్టర్ చెఫ్ పోటీలు ఆషామాషీ కాదు. వారంలో నాలుగురోజులు రకరకాలు చెయ్యాలి. ఆదివారం స్పెషల్. మిస్టరీ బాక్స్ లో ఉన్న పదార్థాలతోనే వండాలి. ప్రతి రౌండ్ లోనూ నెగ్గి ఫైనల్ కు చేరే లోపు మహా మహా వంటగాళ్ళే వెనక్కి వెళ్ళిపోతారు. అన్నట్టు ఈ పోటీలో పాల్గొనేవారు వేరే ఉద్యోగం చేసే వారై వంట హాబీగా మాత్రమే తెలిసుండాలి. అందుకే జస్టిన్ తన ఉద్యోగాన్ని, చదువుని ఈ పోటీలకోసం వదిలేసాడు. ఫైనల్ లో కిష్వర్ చౌదరి, పేట కాంప్ బెల్ అతని ప్రత్యర్ధులు. వీరిలో కాంప్ బెల్ తో చక్కని స్నేహబంధం అల్లుకున్నాడు.కేవలం వంటలతోనే నారాయణ్ వీక్షకులు, జడ్జిల మనసు దోచుకోలేదు. తన హాస్యచతురత, స్నేహ స్వభావం కూడా ఇందుకు కారణమే. చికెన్ కర్రీ, పికెల్ సలాడ్, చికెన్ టాకోస్, రోటీ, చార్ కోల్ చికెన్ వంటి ఇండియన్ వంటకాలతో గ్రాండ్ ఫైనల్లో ఆకట్టుకుని 250,౦౦౦ (1.86 కోట్లు)డాలర్లు ప్రైజ్ మనీ గా అందుకున్నాడు.
ఇండియన్ ఫుడ్ ట్రక్ లేదా రెస్టారెంట్ పెట్టాలని ఈ నల భీముడి కోరిక. మంచి మనసు కూడా తన సొంతమంటూ తన ఆదాయం నుంచి కొంత భారత్ లో పేదపిల్లలకు అందిస్తానంటున్నాడు.
గతంలో కూడా టీనేజ్ పిల్లల కోసం పాస్టర్ గా సేవలందించాడు జస్టిన్. అరవైనాలుగు కళల్లో ఒకటైన వంట వండగానే సరిపోదు, వడ్డించే ఔదార్యం, సహృదయం … ఉంటేనే రాణింపు. ఈ సుగుణాలు ఉన్నాయి కనుకే నారాయణుడు పాక శాస్త్ర ప్రవీణుడయ్యాడు.
-కె. శోభ
Read More: చైనా యువత పడక ఉద్యమం
Read More: రాశి తగ్గి వాసి పెరిగిన పెళ్లిళ్లు