పాకిస్థాన్‌లో మరోసారి ఉగ్రవాదులు భారీ విధ్వంసానికి పాల్పడ్డారు. వాయువ్య పాకిస్థాన్‌లోని కీలక నగరం, ఖైభర్ పఖ్తుంక్వ రాష్ట్ర రాజధాని పెషావర్‌లోని మసీదులో ఆత్మాహుతి దాడికి ఉగ్రవాదులు తెగపడ్డారు. దీంతో పైకుప్పు కుప్పకూలింది. శకలాల కింద చాలా మంది చిక్కుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. మసీదులో ప్రార్థనలు చేస్తున్న వారిలో అక్కడికక్కడే 28 మందికి పైగా మృతి చెందారు. మరో 120 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అత్యవసర చికిత్స కోసం లేడి రీడింగ్ ఆస్పత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు 39 మందిని అంబులెన్స్‌లో తీసుకొచ్చినట్టు పెషావర్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
భద్రతా అధికారుల ప్రకారం.. ఆత్మాహుతి దాడి చేసిన వ్యక్తి ప్రార్థన సమయంలో ముందు వరుసలో ఉన్నాడు, అతను తనను తాను పేల్చుకున్నాడు. దాడికి బాధ్యులమని ఇప్పటివరకు ఎవరూ ప్రకటించలేదు. ఇది ప్రధానంగా తెహ్రీక్- ఇ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) ప్రభావమున్న ప్రాంతం. పైగా మసీదు ప్రాంగణంలో పోలీసు హెడ్ క్వార్టర్ ఉంది. ఇటీవల కాలంలో టీటీపీ ఉగ్రవాదులు భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకునే దాడులు చేస్తున్నారు. దీంతో టీటీపీ హస్తం ఉందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కొద్దిరోజులుగా ఖైభర్ పఖ్తుంక్వ రాష్ట్రంలో పస్తున్ ప్రజలు ప్రభుత్వ విధానాలపై అసంతృప్తితో ఉన్నారు. పాక్ ప్రభుత్వంలోని పాలకులు కేవలం పంజాబ్ రాష్ట్రానికే నిధులు విడుదల చేస్తున్నారని కేపికే ప్రావిన్స్ లో అభివృద్ధి పట్టించుకోవటం లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో తెహ్రీక్- ఇ-తాలిబన్ పాకిస్థాన్(టిటిపి) ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు ప్రజల నుంచి మద్దతు పెరిగింది. 2018 తరువాత ఇదే అత్యంత ఘోరమైన దాడిగా పాక్ అధికారులు చెబుతున్నారు. 2018లో పెషావర్‌లోనే షిత్తీ మసీదుపై ఐసిస్ ఆత్మాహుతి దాడి జరిగింది. ఆ ఘటనలో ఏకంగా 64 మంది పౌరులు చనిపోయారు.