ఐశ్వర్యరాయ్ మొదలుకుని వెండితెర పై వెలుగుతున్న చాలా మంది కథానాయికలు అందాల పోటీల నుంచి వచ్చినవారే. అదే జాబితాకు చెందిన నటే ప్రియాంక చోప్రా. మోడల్‌గా పని చేసిన ఆమె 2000వ సంవత్సరంలో ప్రపంచ సుందరి కిరీటాన్ని చేజిక్కించుకున్న తరువాత బాగా పాపులర్ అయ్యింది. ప్రియాంక 1982 జులై 18న జమ్ షేడ్ పూర్ లో జన్మించింది. ఆమెది మిలటరీ నేపధ్య కుటుంబం. ఆమె తండ్రి అశోక్ చోప్రా, తల్లి మధు. ఇద్దరూ ఇండియన్ ఆర్మీలో డాక్టర్లే. తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా దేశంలోని ఎన్నో ప్రాంతాలు తిరగడం వలన చిన్నతనంలోనే ప్రియంక ఎన్నో ప్రాంతాలు చూసేశారు. 18 ఏళ్ల వయసులో ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లారు ప్రియంకా. వాళ్ల అత్తయ్య కుటుంబం అక్కడ ఉండడంతో వాళ్ల ఇంట్లో ఉండి చదువుకున్నారు. క్లాసికల్ మ్యూజిక్, ఓరల్ సింగింగ్ కూడా నేర్చుకున్నారు.
ప్రియాంకకు ఆసక్తి ఉండడంతో 2000 సంవత్సరంలో మిస్ ఇండియా పోటీలకు వాళ్ల అమ్మ పంపించారు. ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో ప్రియంకకు రెండో స్థానం లభించింది. ఆ ఉత్సాహంతో 2000 మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొని టైటిల్ పొందారు. ఆ వెంటనే సినిమా రంగం నుంచి ఆఫర్స్ ఆమెను చుట్టిముట్టాయి. అయితే.. అప్పటికే ఓ సంస్థతో అగ్రిమెంట్ చేసుకోవడంతో సినిమాలకు సైన్ చేయలేకపోయారు. హిందీలో ఆమెకు వచ్చిన తొలి అవకాశం హమ్ రాజ్. బాబీ డియోల్, అక్షయ్ ఖన్నా హీరోలుగా నటించిన ఆ చిత్రంలో అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. అప్పుడు ఆ పాత్రను అమీషా పటేల్ పోషించారు.
అదే సమయంలో తమిళ నటుడు విజయ్ నటించిన తమిళం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యారు. 2002 ఏప్రిల్ 12న ఆ సినిమానే ప్రియాంకకు తొలి సినిమా. ఆ సమయంలోనే చాలా మంది తెలుగు నిర్మాతల దృష్టిని ఆకర్షించారు ప్రియంక. ఎంతో మంది నిర్మాతలు ఆమె డేట్స్ కోసం ప్రయత్నించారు. ఆ పోటీల్లో నెక్కంటి శ్రీదేవి మాత్రం ప్రియాంక డేట్స్ సంపాదించగలిగారు. 2002లో ప్రారంభమైన ఆ చిత్రం పేరు అపురూపం. సాయిరవి దర్శకత్వం వహించిన చిత్రంలో ప్రసన్న హీరో. హీరోయిన్ గా తన తొలి పుట్టినరోజును ఈ చిత్రం షూటింగ్ లోనే జరుపుకున్నారు. సగానికి పైగా పూర్తైన అపురూపం షూటింగ్ ఆర్ధిక కారణాల వలన ఆగిపోయింది.
ఆ సినిమా విడుదల అయ్యుంటే.. ప్రియాంక తెలుగులో బిజీ అయ్యుండేవారు. అదీ ఒకందుకు మంచిదే అయ్యింది. హిందీ సినిమాల్లో ట్రై చేసి అక్కడ బిజీ కాగలిగారు. మొదట్లో అందానికి ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో ఒదిగిపోయారు. ఆతర్వాత అభినయానికి ఆస్కారం ఉన్న పాత్రల్లో మెప్పించి జాతీయ అవార్డు కూడా పొందారు. ఇప్పుడు ప్రియాంక ఇండియాలోనే హయ్యస్ట్ పెయిడ్ హీరోయిన్. అంతే కాదు గ్లోబర్ స్టార్ గా కూడా ఎదిగారు. నిక్ జోనస్ ని పెళ్లి చేసుకుని లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు.