కాపుల రిజర్వేషన్స్ అంశంలో బిజెపి ఎంపి జీవీఎల్ నరసింహారావు ఎందుకు సన్మానాలు చేయించుకుంటున్నారో, చేసేవాళ్ళు ఎందుకు చేస్తున్నారో తనకు అర్ధం కావడం లేదని బిజెపి నేత కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. కాపు రిజర్వేషన్ అంశాన్ని చంద్రబాబు ప్రభుత్వం పూర్తి చేసిందని గుర్తు చేశారు.
ఓబిసి కోటాలో మార్పులు చేర్పులు చేసే అధికారాన్ని రాష్ట్రాలకు బదలాయిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ కూడా చేసిందని, ఈ విషయం గూగుల్ లో ఎవరు వెతికినా దొరుకుతుందని, ఇదే అంశంపై రాజ్యసభలో ప్రశ్న రూపంలో వేసి సమాధానం రాబట్టారని ఇందులో కొత్తేమీ లేదని ఎద్దేవా చేశారు. ఈ సవరణ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం కాపులను ఓబిసి కోటాలో చేర్చి వారికి ఐదు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై బిజెపిలో చర్చించి అమలు జరిగే విధంగా జగన్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.
పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ పెట్టి పదేళ్ళు అవుతోందని, రెండు ఎన్నికలు కూడా చూశారని, తనకు, తన పార్టీకి రాజకీయంగా ఎలా లబ్ధి చేకూరుతుందో ఆలోచించుకునే అవకాశం ఆయనకే వదిలి పెట్టాలని సూచించారు. ఇటీవల జనసేనపై కాపు నేత హరిరామజోగయ్య చేసిన వ్యాఖ్యలపై కన్నా స్పందిస్తూ…. జనసేనను బైట నుంచి ఎవరూ ప్రభావితం చేయకుండా ఉంటే బాగుంటుందని, ఏం చేయాలనే నిర్ణయాన్ని పవన్ కే వదిలేస్తే మంచిదని అభిప్రాయపడ్డారు.