చదువు అనే అస్త్రాన్ని పేదలకు ఇచ్చినప్పుడే వారి తలరాత మారుతుందని తమ ప్రభుత్వ ప్రగాఢ నమ్మకమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకే పేదవారి చదువుపై పెట్టె ప్రతి పైసా పిల్లలకు ఇచ్చే ఆస్తిగానే భావిస్తున్నామన్నారు.  నిరుపేదల ఇళ్ళలో ఆడబిడ్డల వివాహానికి ప్రభుత్వం నుంచి సాయం అందించే ‘వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా’ కార్యక్రమాలకు నేడు  సిఎం జగన్ శ్రీకారం చుట్టారు. అక్టోబర్‌– డిసెంబర్‌ 2022 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 4,536 మంది లబ్ధిదారులకు రూ. 38.18 కోట్ల ఆర్ధిక సాయాన్ని నేడు బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు.

పిల్లలను మంచిగా చదివించాలన్న ఉద్దేశంతోనే వయసు మాత్రమే  కాకుండా చదువును కూడా అర్హతగా నిర్ణయించామని వెల్లడించారు. లబ్దిదారులు చదువుకుంటారు కాబట్టి భవిష్యత్తుల్లో వారి పిల్లలకు కూడా మంచి విద్య అందించే ఆలోచన చేస్తారని సిఎం అన్నారు. దీనితో తర్వాతి తరాలు కూడా చదువు బాట పడతాయన్నారు.

పిల్లల చదువును ప్రోత్సహించడం, బాల్య వివాహాలను నివారించడం, బడుల్లో చేరేవారి  శాతాన్ని పెంచడం, డ్రాపౌట్‌ రేట్‌ను తగ్గించడం లక్ష్యాలుగా  వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా పథకాలు అమలు చేస్తున్నామన్నారు.

తాము ఇప్పటికే అమ్మ ఒడి పథకం అమలు చేస్తున్నామని, మరోవైపు  వివాహ వయస్సు ఆడవారికి 18, మగవారికి 21గా ఉంది కాబట్టి ఈ కళ్యాణ మస్తు  లబ్ధిదారులు కేవలం పదో తరగతి మాత్రమే కాకుండా ఇంకా ఎక్కువ కూడా చదువుకునే ఆస్కారం ఉంటుందని సిఎం వివరించారు.

ఈసారికి కళ్యాణమస్తు, షాదీ తోఫా సాయం పెళ్లి కూతుళ్ళ అకౌంట్లలో వేశామని, వివిధ వర్గాలనుంచి వచ్చిన అభిప్రాయం మేరకు వచ్చేసారి నుంచి వారి తల్లుల అకౌంట్లకు జమ చేస్తామని వెల్లడించారు.

వివిధ జిల్లాల నుంచి లబ్ధిదారులు సిఎం జగన్ తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖా ముఖి మాట్లాడి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *