జింబాబ్వేతో ఆ దేశంలో జరిగిన రెండు టెస్టుల సిరీస్ ను వెస్టిండీస్ 1-0 తేడాతో గెల్చుకుంది. తొలి టెస్ట్ డ్రా గా ముగిసిన సంగతి తెలిసిందే. రెండో టెస్ట్ నేడు మూడోరోజునే ముగిసింది. ఈ టెస్టులో విండీస్ ఇన్నింగ్స్ 4 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
బులావాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో మొన్న ఫిబ్రవరి 12 న మొదలైన ఈ మ్యాచ్ లో జింబాబ్వే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొని తొలి ఇన్నింగ్స్ లో 115 పరుగులకే ఆలౌట్ అయ్యింది. గుడకేష్ మోతీ ఏడు వికెట్లతో ఆతిధ్య జట్టును దెబ్బ తీశాడు. హోల్డర్ రెండు, అల్జారీ జోసెఫ్ ఒక వికెట్ పడగొట్టారు. విండీస్ తొలి ఇన్నింగ్స్ లో 292 పరుగులకు ఆలౌట్ అయి 177 పరుగుల ఆధిక్యం సంపాదించింది. జింబాబ్వే బౌలర్లలో నయోచి ఐదు, బ్రాండన్ మవుట మూడు వికెట్లతో సత్తా చాటారు.
జింబాబ్వే రెండో ఇన్నింగ్స్ లో 173 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీనితో విండీస్ ఇన్నింగ్స్ నాలుగు పరుగులతో విజయభేరి మొగించింది. రెండో ఇన్నింగ్స్ లో సైతం మోతీ ఆరు వికెట్లతో జింబాబ్వే బ్యాటింగ్ లైనప్ ను కుప్పకూల్చాడు. మొదటి టెస్టులో కూడా మోతీ ఆరు వికెట్లు సాధించడం గమనార్హం.
రెండో టెస్టులో మొత్తం 13 వికెట్లతో రాణించిన మోతీకి ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ తో పాటు, ప్లేయర్ అఫ్ ద సిరీస్ కూడా దక్కింది.