విశాఖపట్నం నగరం మరో కీలక సదస్సుకు ముస్తాబవుతోంది. మార్చి3,4 తేదీల్లో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సుకు నగరం ఆతిథ్యం ఇస్తోన్న సంగతి తెలిసిందే. ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్స్ లో జరగనున్న ఈ సదస్సు ఏర్పాట్లను రాష్ట్ర పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటి శాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్ పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. మనదేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన సుప్రసిద్ధ కంపెనీల ప్రతినిధులు ఈ సద్సస్సులో పాల్గొంటున్నారు.
దేశంలోనే రెండో అతిపెద్ద సముద్ర తీర ప్రాంతం కలిగి ఉంది, సహజ వనరులు అపారంగా ఉన్న ఆంధ్ర ప్రదేశ్ లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించి పలు కంపెనీలను ఇక్కడ తమ కార్యకలాపాలు ప్రారంభించేలా చూడడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పరిశ్రమల కోసం 26 వేల నుంచి 30 వేల ఎకరాల భూములు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని, పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం నుంచి అందే సహకారాన్ని పారిశ్రామిక వేత్తలకు వివరించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. – పునరుత్పాదక విద్యుత్‌కు సంబంధించి ఎక్కువ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.