భారత మహిళా ఫుట్ బాల్ జట్టు ఫార్వర్డ్ ప్లేయర్ బాలాదేవి 2020-21 సంవత్సరానికి ఫుట్ బాలర్ అఫ్ ద ఇయర్ గా ఎంపికయ్యారు. మరో యువ క్రీడాకారిణి మనీషా కళ్యాణ్ ఎమర్జింగ్ ప్లేయర్ అఫ్ ద ఇయర్ గా ఎంపికయ్యారు.
బాలాదేవి ప్రస్తుతం స్కాట్లాండ్ లోని రేంజేర్స్ ఫుట్ బాల్ క్లబ్ తరఫున అక్కడి లీగ్ లో ఆడుతున్నారు. మన దేశం నుంచి యూరప్ లో ప్రొఫెషనల్ కాంట్రాక్ట్ కు ఎంపికైన తొలి మహిళా ప్లేయర్ గా ఆమె రికార్డు సొంతం చేసుకున్నారు. గత ఏడాది కరోనా మొదలు కావడానికి కొద్దురోజుల ముంది ఇక్కడకు చేరుకున్నానని, ఇక్కడి క్లబ్ లో ఆడడం ద్వారా తన ఆటతీరు మెరుగు పర్చుకున్తున్నానని బాలా దేవి వెల్లడించారు.
తనకు అవార్డు రావడం సంతోషంగా ఉందని, ఫుట్ బాల్ ఫెడరేషన్ కు, కోచ్ లకు, కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా ప్రేక్షకులకు తన కృతజ్ఞతలు తెలిపారు.
1990లో మణిపూర్ లో జన్మించిన బాలా దేవి 2002 లో తన 12 వ ఏట నుంచే ఫుట్ బాల్ ప్రొఫెషనల్ మ్యాచ్ లు ఆడటం ప్రారంభించారు. అండర్ – 16, 19 కు ఆడిన బాలాదేవి 2010 నుంచి జాతీయ జట్టుకు ఆడుతున్నారు.
భవిష్యత్ లో తన ఆట తీరు మరింత మెరుగుపరచుకోడానికి ఈ అవార్డు ప్రేరణ కలిగిస్తుందని ఎమర్జింగ్ ప్లేయర్ గా ఎంపికైన 19 ఏళ్ళ మనీషా కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు. తనను తీర్చి దిద్దిన కోచ్ లు, ప్రోత్సహించిన సహచర ఆటగాళ్ళు, జాతీయ జట్టు సిబ్బంది, ఫెడరేషన్ కు మనీషా కృతజ్ఞతలు తెలియజేశారు.
2001 నవంబర్ 27న పంజాబ్ లో న్మించిన మనీషా తన 13 వ ఏట నుంచే ఫుట్ బాల్ మ్యాచ్ లు ఆడుతున్నారు. 2019 నుంచి జాతీయ జట్టులో సభ్యురాలిగా కొనసాగుతున్నారు.