ఇంగ్లాండ్ తో జరిగిన మూడో వన్డేలో బంగ్లాదేశ్ 50 పరుగులతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసి 246 పరుగులు చేసిన బంగ్లాదేశ్… ఇంగ్లాండ్ ను 196 పరుగులకే ఆలౌట్ చేసింది.
చిట్టగాంగ్ లోని జహూర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో బంగ్లా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. శామ్ కర్రన్ దెబ్బకు 17 పరుగులకే ఓపెనర్లు ఇద్దరూ (తమీమ్ ఇక్పాల్ -11; లిట్టన్ దాస్ – డకౌట్) పెవిలియన్ చేరారు. నజ్ముల్ శాంటో- ముస్ఫిఖర్ రెహ్మాన్ లు మూడో వికెట్ కు 98 పరుగులు జోడించారు. శాంటో-50; ముస్ఫిఖర్-70 రన్స్ చేసి ఔట్ కాగా, షకీబ్ అల్ హసన్ 75 పరుగులతో రాణించాడు. 48.5 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
ఇంగ్లాండ్ బౌలర్లలో మోయిన్ అలీ-3; శామ్ కర్రన్, ఆదిల్ రషీద్ చెరో 2; క్రిస్ ఓక్స్, రెహాన్ అహ్మద్ చెరో వికెట్ పడగొట్టారు.
ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ లో జేమ్స్ వీన్స్-38; ఫిలిప్ సాల్ట్-35; క్రిస్ ఓక్స్-34; జోస్ బట్లర్-26; శామ్ కర్రన్-23 మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. 43.1 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
బంగ్లా బౌలర్లలో షకీబ్ అల్ హసన్ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. తైజుల్ ఇస్లామ్, ఎబాదత్ హోస్సేన్ చెరో 2; ముస్తాఫిజుర్ రెహ్మాన్, హసన్ మిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు.
షకీబ్ అల్ హసన్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’, ఆదిల్ రషీద్ కు ‘ప్లేయర్ అఫ్ ద సిరీస్’ దక్కాయి.
వన్డే సిరీస్ ను 2-1 తో ఇంగ్లాండ్ గెల్చుకుంది.