రాష్ట్రంలో అకాల వర్షాలు, వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటలను పరిశీలించి, రైతులకు బాసటగా నిలిచేందుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గురువారం ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో చేపట్టిన పర్యటన చేపట్టి రైతాంగానికి గొప్ప భరోసానందించారు. ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా అడుగడునా రైతులను పలకరిస్తూ, దెబ్బతిన్న పంటను పరిశీలిస్తూ సాగిన సీఎం పర్యటన రైతులకు ధీమా కల్పించింది. రైతులను అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇవ్వడం రైతులకు గొప్ప ఊరటనిచ్చింది.
గురువారం ఉదయం ప్రగతి భవన్ నుంచి బేగం పేట ఎయిర్ పోర్టుకు చేరుకొని, అటు నుంచి హెలికాప్టర్ లో ఖమ్మం మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్ పర్యటనలను సీఎం కేసీఆర్ వరుసగా చేపట్టారు. ఉదయం నుంచి సాయంత్ర దాకా ఎర్రటి ఎండల్లో తిరిగుతూ, పంట నష్టం పోయిన రైతుల్లో ధైర్యం నింపుతూ, వారికి అభయమిస్తూ సుడిగాలి పర్యటన చేపట్టారు. అడుగగుడునా రైతుల కష్టాలు తెలుసుకుంటూ నేనున్నానంటూ వారికి భరోసానిచ్చారు.
ఖమ్మం జిల్లా పర్యటన వివరాలు:
నాలుగు జిల్లాల పర్యటనలో భాగంగా మొదట ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రామాపురం గ్రామానికి సీఎం కేసీఆర్ హెలికాప్టర్ లో చేరుకున్నారు. ముందుగా ఏరియల్ సర్వే ద్వారా అకాల వర్షాలకు తోడు వడగండ్లతో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. అనంతరం గార్లపాడు మార్గంలో నేలకొరిగిన మొక్కజొన్న పంటను సీఎం పరిశీలించిన సీఎం .. మొక్కజొన్న పంట రైతులతో పంట నష్టంపై చర్చించారు. పంట నష్టం పై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను పరిశీలిస్తూ అధికారుల నుంచి పంట నష్టం వివరాలను తెలుసుకున్నారు.
ఖమ్మం జిల్లాలో జరిగిన సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ – ముఖ్యాంశాలు :
• గాలివాన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని పంటలు కలిపి రాష్ట్రంలో 2 లక్షల 22 వేల 250 ఎకరాల్లో నష్టం కలిగింది.
• ముఖ్యంగా మొక్కజొన్న 1,29,446 ఎకరాలు, వరి 72, 709 ఎకరాలు, మామిడి 8,865 ఎకరాలు, ఇతర పంటలు 17, 238 ఎకరాల్లో పంట నష్టం జరిగింది.
• కేంద్ర ప్రభుత్వ కోడ్ ప్రకారం రైతులకు పెద్దగా ఏం రాదు.
• తెలంగాణ రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేశాం. నూతన ప్రాజెక్టులు వడివడిగా పూర్తి చేయడం గానీ, ఇంకొన్ని పూర్తయ్యే దశలో ఉన్నాయి.
• తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ గా ఉంది.
• మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల కంటే కూడా అత్యధిక తలసరి ఆదాయం కలిగి ఉన్నాం.
• తెలంగాణ తలసరి ఆదాయం 3 లక్షల 5 వేలు.
• జీఎస్టీడీపీ యొక్క పెరుగుదలలో వ్యవసాయం యొక్క పాత్ర చాలా పెద్దగా ఉంది.
• లక్షలాది మందికి అనేక రకాలుగా ఉపాధి కల్పిస్తున్నది వ్యవసాయ రంగం.
• ఒక అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాం.
• దేశంలో వరి 50 లక్షల ఎకరాల్లో లేదు. కానీ ఒక్క తెలంగాణలోనే వరి 56 లక్షల ఎకరాల్లో పండిస్తున్నారు. ఇది మనకు గర్వకారణం.
• రైతులు ఏమాత్రం నిరాశకు గురికావద్దని మనవి చేస్తున్నా. ప్రభుత్వం మీకు అండదండగా ఉంటుంది.
• ఈ దేశంలో ఓ పద్దతీ పాడూ లేదు. ఇన్సూరెన్స్ కంపెనీలకు లాభం కలిగించే బీమాలే ఉన్నయ్ తప్పితే పంట నష్టం జరిగితే రైతులకు లాభాలు కలిగించే బీమా సంస్థలు, బీమాలు లేవు.
• పాత కేంద్ర ప్రభుత్వాలు అంతే.. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వమైతే చెవిటోని ముందు శంఖం ఊదినట్లే ఉన్నది.
• కేంద్రానికి చెప్పినా.. గోడకు చెప్పినా ఒకటే పరిస్థితి అన్నట్లు ఉంది.
• దేశానికి కొత్త అగ్రికల్చర్ పాలసీ అవసరం ఉంది.
• మొత్తం వ్యవసాయ పాలసీని బీఆర్ఎస్ ఇస్తుంది.
• ఇలాంటి విపత్కర పరిస్థితే వస్తే కేంద్రం తీరు దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కులు మొరిగినట్లుగా ఉంటున్నది.
• ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం మీర దుర్మార్గంగా వ్యవహరిస్తూ.. దేశంలో రాజకీయాలు తప్ప రైతులు లేరు, ప్రజలు లేరు అన్నట్లుగా వ్యవహరిస్తున్నది.
• గతంలో కేంద్రానికి నివేదికలు పంపినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.
• మా రైతులను మేమే కాపాడుకుంటం.. వంద శాతం మేమే ఆదుకుంటాం.
• కేంద్రం ఇచ్చేది మొక్కజొన్న ఎకరానికి రూ.3,332, వరి చేలు అయితే రూ.5,400, మామిడితోటలు ధ్వంసం అయితే రూ.7,200 చెల్లిస్తున్నది. ఇది ఏ మూలకు కూడా సరిపోదు.
• తెలంగాణ ప్రభుత్వం ఉచిత కరెంటు, సాగునీరు, గతంలో ఉన్న సాగునీటి సెస్సులను కూడా రద్దు చేసి అనేక విధాలుగా ఆదుకొంటేనే వ్యవసాయం పటిష్టపడి అభివృద్ధి జరుగుతున్నది.
• వ్యవసాయం మరియు పరిశ్రమ ఇది. మిల్లులలో అనేక మందికి ఉపాధి దొరుకుతుంది. రవాణా రంగంలోనూ ఉద్యోగాలు దొరుకుతయ్.
• దేశంలోనే మొదటిసారిగా సహాయ పునరావాస చర్యలను తెలంగాణ ప్రభుత్వం ఎకరానికి రూ.10 వేలను అందిస్తాం.
• కౌలు రైతులను కూడా ఆదుకునేలా ఆదేశాలు జారీ చేస్తాం.
• తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వం. రబ్బరు బంతుల్లాగా తిరిగి ఎగిరే విధంగా రైతులు పుంజుకోవాలి.
• రైతులు ధైర్యం కోల్పోవద్దని మనవి.
• దున్నపోతు మీద వర్షం పడ్డట్టు కేంద్రం వ్యవహరిస్తోంది.
• రూ.228 కోట్లను వెంటనే మంజూరు చేస్తున్నాం.
ఈ కార్యక్రమంలో సీఎం గారి వెంట మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, నామా నాగేశ్వరరావు, జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కందాల ఉపేందర్ రెడ్డి, రాములు నాయక్, మెచ్చ నాగేశ్వరరావు, రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు ఎన్. వెంకటేశ్వర రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, జెడ్పి చైర్మన్ లింగాల కమల్ రాజ్, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్, అదనపు కలెక్టర్లు స్నేహాలత మొగిలి, ఎన్. మధుసూదన్, ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయ నిర్మల తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం జిల్లా రైతులను ఓదార్చి, వారిలో భరోసాను నింపిన సీఎం కేసీఆర్ అటు నుంచి మహబూబాబాద్ జిల్లా పర్యటనకు బయలుదేరారు.
మహబూబాబాద్ జిల్లా పర్యటన వివరాలు:
ఖమ్మం జిల్లా పర్యటన అనంతరం సీఎం కేసీఆర్ మహబూబాబాద్ జిల్లాకు చేరుకున్నారు. ఏరియల్ వ్యూ ద్వారా మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం రెడ్డికుంటతండా(ఆర్కే తండా)లో దెబ్బతిన్న పంటలను సీఎం కేసీఆర్ పరిశీలించారు. మొక్కజొన్న, మిర్చి పంటలు, మామిడి తోటలను స్వయంగా తిరిగి అణువణువునా పరిశీలించిన సీఎం…ఎర్రని ఎండలో తిరుగుతూ, రైతులతో మాట్లాడుతూ వారిని ఓదార్చి, వారిలో ధైర్యాన్ని నింపారు. జాటోత్ చిన్న సోమ్లా అనే రైతును పరామర్శించిన సీఎం కేసీఆర్ అధైర్యానికి లోనుకావద్దనీ, ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా అండగా వుంటుందని హామీ ఇచ్చి, భరోసా కలిగించారు. జాటోత్ నెహ్రూ నాయక్ మామిడి పంటను నష్టపోయిన జాటోత్ నెహ్రూ నాయక్ తోటను కలియ తిరగటంతో పాటు, బానోత్ భిక్షు వెంకన్న మొక్కజొన్న పంటను పరిశీలించి ప్రభుత్వం అన్ని విధాల సహాయ,సహకారమందిస్తుందని భరోసా నిచ్చారు. వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని, ఎట్టి పరిస్థితుల్లో వారిని కిందపడనిచ్చే పరిస్థితి రానీయమని రైతులను సీఎం ఓదార్చారు. సీఎం తో మాట్లాడిన రైతులు కాళేశ్వరం ప్రాజెక్టుతో అందుతున్న సాగునీళ్ళు, రైతుబంధు పంట పెట్టుబడి పథకం పై సంతృప్తి వ్యక్తం చేశారు. కౌలు రైతులు ఎవరైనా ఉన్నారా అని ఆరా తీశారు. అక్కడున్న రైతులను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. అక్కడే భోజనాలు ఏర్పాటు చేశామని అధికారులు చెప్పినప్పటికీ, మరో రెండు జిల్లాలు పర్యటించాల్సి ఉన్నందున సమయం లేకపోవడంతో… తన పర్యటన కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులోనే పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి వెంట తెచ్చుకున్న సద్దిని సీఎం తిన్నారు.
మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని రెడ్డికుంట తండాలో రైతులను ఉద్దేశించిన మాట్లాడిన సీఎం కేసీఆర్ గారు – ముఖ్యాంశాలు :
• దేశంలోనే ఎక్కడాలేని విధంగా 24 గంటల ఉచిత కరెంటును, రైతుబంధు సదుపాయం ఇచ్చుకొని, ప్రాజెక్టుల నుంచి నీళ్లు కూడా ఉచితంగా ఇచ్చుకొని వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేసుకున్నాం.
• మంచి ప్రగతి దశలోకెళ్లే సమయం ఇది.
• అన్ని రకాల పంటలు కలిపితే దాదాపు 75 నుంచి 80 లక్షల ఎకరాల్లో సాగు ఉంది.
• తెలంగాణ రాష్ట్రంలో నేడు 56 లక్షల ఎకరాల్లో ఒక్క వరి సాగులో ఉంది.
• వ్యవసాయంలో మంచి వృద్ధిలోకి వచ్చాం.
• జీడీపీ కూడా వ్యవసాయ రంగానికి మంచి లాభం ఉంది భారతదేశానికే ఒక పాఠం చెప్పే విధంగా కష్టపడి రుజువు చేసినం.
• మన రైతులు కూడా ఇప్పుడిప్పుడే అప్పుల నుంచి బయటపడుతున్నరు.
• రైతులకు పాత బాధలు పోయినయి.
• అనుకోకుండా రాళ్లవాన వచ్చింది. హైదరాబాద్ నుంచే ప్రకటన చేయవచ్చు. కానీ రైతుల్లో ధైర్యాన్ని నింపేందుకు ఈ పర్యటన చేపట్టాను.
• వాస్తవానికి ఎకరానికి సాధారణంగా రూ.3 వేలే ఇస్తరు.
• కానీ మనం అలా కాకుండా ఎకరానికి రూ.10 వేలు ఇవ్వమని చెప్పి డబ్బులు మంజూరు చేశాం.
• నేను స్వతహాగా రైతును, మట్టిలో పుట్టిన. మేమూ వ్యవసాయం చేస్తాం కాబట్టి.. ఆ బాధ మాకు తెలుసు.
• ఎట్టి పరిస్థితుల్లో వ్యవసాయాన్ని వెనుకపడనీయవద్దు. ముందుకే పోవాలి. నీళ్లు రానికాడ కూడా తెచ్చుకోవాలి. అవసరమైతే ఇంకో పదెకరాలు ఎక్కువ పండించాలె.
• రాష్ట్రం ఎట్ల సంపాదించుకున్నమో.. అలాగే వ్యవసాయాన్ని కూడా అట్లనే పెంచుకుంట పోతున్నం..ఉద్యమం చేసినట్లే.
• ఇంత ఎండలో ఇంత దూరం మొత్తం రాష్ట్ర, జిల్లా అధికారులు, నాయకులు ఎందుకొచ్చినమంటే.. రైతులకు ధైర్యం చెప్పడానికే.
• మునుపటి మాదిరిగా అగో అంటే దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్లు కాకుండా తొందరగనే చర్యలు తీసుకుంటున్నం.
• కౌలుకు తీసుకున్న రైతులు పెట్టుబడి పెట్టి నష్టపోయిండ్రు కాబట్టి రైతులుగ ఉన్నోళ్లు ఆదుకోండి. కలెక్టర్లు మీటింగ్ పెట్టి అందర్నీ పిలుస్తరు. ప్రభుత్వం అందించే సాయంలో కౌలు రైతులకు కూడా కొంత ఆదుకోవాలి.
• తెలంగాణలో అందరు మంచిగ బతకాలె. అందరం బాగుండాలె.
• మనసు ధైర్యం చెడవద్దని కోరుకుంటున్నా.
• మీరు ధైర్యంగా ఉంటేనే నాకు ధైర్యం.
ఈ కార్యక్రమంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, సత్యవతి రాథోడ్, రైతు బంధు రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీలు జోగినపల్లి సంతోష్ రావు,పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎమ్మెల్యే డి.ఎస్. రెడ్యానాయక్, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ నెమరుగొమ్ముల సుధాకర్ రావు, చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, సిఎం ఓఎస్డీ స్మితా సబర్వాల్, వ్యవసాయశాఖ కమిషనర్ రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ శశాంక, అడిషన్ కలెక్టర్లు అభిలాష అభినబ్, ఎం.డేవిడ్, సంబంధిత శాఖల అధికారులు, రైతులు ఉన్నారు.
మహబూబాబాద్ జిల్లా రైతుల్లో భరోసాను నింపిన సీఎం కేసీఆర్ అక్కడనుంచి వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం అడవిరంగాపురానికి బయలుదేరారు.
వరంగల్ పర్యటన వివరాలు:
• మహబూబాబాద్ జిల్లా రెడ్డికుంట తండా నుంచి వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం అడవి రంగాపురం చేరుకున్న సీఎం కేసీఆర్ అక్కడి పరిసర గ్రామాల్లో వడగండ్ల వానతో దెబ్బ తిన్న పంటలను ఒక్కొక్కటిగా పరిశీలించారు. పంట నష్టంపై అధికారులు అందించిన వివరాలను సీఎం సావధానంగా విన్నారు. అనంతరం పంట పొలాల్లోకి స్వయంగా వెళ్ళి రైతులను పలకరించారు. రైతులను సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం రైతులను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని రైతులకు హమీ ఇచ్చారు. అనంతరం అడవి రంగాపురం లో దెబ్బతిన్న మొక్కజొన్న, వరి పంటలను పరిశీలించి అక్కడే ఉన్న రైతులతో కేసీఆర్ కాసేపు మాట్లాడి అధైర్య పడొద్దని, ప్రభుత్వం రైతుల సమస్యలను తీరుస్తుందని హామీ ఇచ్చారు.
రైతులను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగం – ముఖ్యాంశాలు:
• వడగండ్ల వానతో ఈ ప్రాంతం తీవ్రంగా నష్టపోయింది. .తెలంగాణ సాధించుకున్న నాటి నుండి కష్టపడి రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నాం.
• 24 గంటల కరెంట్, ప్రాజెక్ట్ ల ద్వారా సాగు నీరు అందివ్వటం ద్వారా పంటలు సమృద్ధిగా పండి మన రాష్ర్ా ఆదాయం కూడా పెరిగింది.
• నర్సంపేట నియోజకవర్గంలోని పాకాల చెరువు కోసం దేవాదుల ద్వారా శాశ్వతంగా లింక్ ఉండాలని చెప్పి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నా వెంటపడి, పట్టుబట్టి ప్రాజెక్ట్ పూర్తి చేయించుకున్నాడు. నేడు పాకాల చెరువుని నింపి రెండో పంటకు నీళ్ళు అందజేసుకుంటున్నాం.
• ప్రాజెక్ట్ లు, నీళ్ళు బందోబస్తుగా చేసుకున్నాం. అద్బుతంగా పురోగమిస్తున్న సమయంలో ఈ వడగండ్ల వాన పడింది.
• మీకు దైర్యం చెప్పి అండగా నిలబడేందుకు ఎర్రటి ఎండలో ఈ పర్యటన చేపట్టాను.
• తెలంగాణ రైతాంగం ఎట్టిపరిస్థితుల్లో ముందుకే పోవాలి తప్ప వెనక్కి వెళ్ళొద్దు.
• నేను మీకు గతంలో ఎంత అండగా ఉన్నానో తెలుసు. ఇప్పుడు కూడా నేడు మీకు అండగా ఉంటాను ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ,సహాకారాలు అందిస్తుంది.
• దేశంలోనే ఎక్కడా ఇవ్వని సహాయం రాష్ట్రం ప్రభుత్వం ఇస్తుంది. కేంద్రం సహకరించటం లేదు.
• రాష్ట్ర ప్రభుత్వమే రైతులను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో వ్యవసాయమంత్రి నిరంజన్ రెడ్డి, చీఫ్ సెక్రెటరీ, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిదులతో చర్చించి ఎకరాకు 10 వేల రూపాయ సాయం అందజేయాలని నిర్ణయించాం.
• కేంద్రం సహాయం చేసేది లేదు, మనం తీసుకునేది లేదు.
• ఎట్టి పరిస్థితుల్లో రైతులు దైర్యం కోల్పోవద్దు. మీకు నేను అండగా ఉంటాను.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖమాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు, వ్యవసాయశాఖామాత్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎంపి కవిత, ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్, రాజయ్య, చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, సిఎం సెక్రటరీ స్మిత సబర్వాల్, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ జిల్లా పర్యటనం అనంతరం కరీంనగర్ జిల్లా పర్యటనకు సీఎం కేసీఆర్ బయలుదేరారు.
కరీంనగర్ జిల్లా పర్యటన వివరాలు :
రైతు సంక్షేమం, వ్యవసాయరంగ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా రైతుల కోసం ఎన్నో పథకాలు, కార్యక్రమాలు చేపడుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం “రైతు ప్రభుత్వం” అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కాస్త ధైర్యంగా ఉండాలనీ, రైతులకు ఎలాంటి సమస్యలు రాకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా ఆధుకుంటుందని సీఎం కేసీఆర్ రైతులకు హామీ ఇచ్చారు. వరంగల్ జిల్లా పర్యటన అనంతరం కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలం లక్ష్మీపూర్ కు సీఎం కేసీఆర్ చేరుకున్నారు. అనంతరం సమీపంలోని మస్క్ మిలన్ పంట సాగుచేస్తున్న దేవరాంచంద్రా రెడ్డి వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. వడగండ్ల వాన వల్ల నష్టపోయిన పంటను పరిశీలించారు. తర్వాత దెబ్బతిన్న డ్రాగన్ ఫ్రూట్ పంటను కూడా పరిశీలించి సాగు విస్తీర్ణం, పంట నష్టం వివరాలను ఆరా తీశారు. ఈ సందర్భంగా రైతు రాంచంద్రారెడ్డి మాట్లాడుతూ గతంలో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి పది పదిహేను బోర్లు వేసినా ఫలితం లేకుండా పోయిందనీ, స్వరాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత 8 నుంచి 10 మీటర్ల లోపే బోర్లలో నీరు పుష్కలంగా లభిస్తున్నదనీ, కరెంటు విషయంలో ఎలాంటి సమస్యా లేదని సీఎం దృష్టికి తెచ్చారు. అటు తర్వాత పక్కనే ఉన్న పొట్టకొచ్చిన వరి పంటను సీఎం పరిశీలించారు. సాగు పద్ధతులు, పంట నష్టం వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు “మీరే సార్ మా రైతుల ధైర్యం, దయచేసి మమ్మల్ని ఆదుకోండి” అంటూ సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు.
అనంతరం సీఎం కేసీఆర్ సమీపంలోని మామిడి రైతు ఎడవెల్లి రాజిరెడ్డి మామిడి తోటకు చేరుకొని, వడగండ్ల వానకు రాలిపోయిన మామిడి కాయలను చేతబట్టుకొని పంట నష్టం వివరాలు తెలుసుకున్నారు. పెట్టిన పెట్టుబడి, పంట నష్టం వివరాలను ఆరా తీశారు. ఎరువుల వాడకం, సేద్యం తీరుతెన్నులను గురించి కాసేపు రైతులతో చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని రైతుల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతున్నామని, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కాస్త ధైర్యంగా ఉండాలని సీఎం రైతులకు సూచించారు. ఈ సందర్భంగా పంట నష్టపోయిన రైతులను, కౌలు దారులను సమన్వయపరిచి నష్టపరిహారం అందేవిధంగా చర్యలు తీసుకోవాలని చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ లను రైతుల సమక్షంలోనే సీఎం కేసీఆర్ ఆదేశించారు. అటు తర్వాత రామడుగు రైతు వేదిక క్లస్టర్ కు చేరుకొని మీడియా సమావేశం నిర్వహించిన సీఎం అనంతరం హెలిప్యాడ్ కు చేరుకొని హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమయ్యారు.
కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండల కేంద్రంలోని రైతు వేదిక లో జరిగిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడిన ముఖ్యాంశాలు
• అనేక జిల్లాల్లో పంట నష్టం జరిగింది.
• మొత్తం మీద 2,28,258 ఎకరాలు దెబ్బతిన్నట్లుగా జిల్లా కలెక్టర్లు ఇచ్చిన రిపోర్టు ప్రకారం తెలుస్తున్నది.
• మొక్కజొన్ననే ఎక్కువగా దెబ్బతిన్నది.
• 1,29,446 ఎకరాల మొక్కజొన్న, 72,709 ఎకరాలు వరిచేలు, 8,865 ఎకరాలు మామిడితోటలు, పుచ్చకాయ, తర్బూజ, టమాటలు, వంకాయలు, రకరకాల కూరగాయలు, పంటలన్నీ కలిపి 17, 238 ఎకరాలు మొత్తం దెబ్బతిన్నట్లుగా తెలుస్తా ఉన్నది.
• బీభత్సమైన వర్షం పడ్డది. నర్సంపేట ప్రాంతంలో చెట్టుకు కాయ కూడా లేదు. వంద శాతం పంట దెబ్బతిన్నది. నష్టం ఎక్కువ జరిగింది.
• తెలంగాణలో గతంలో చొప్పదండి, నర్సంపేట తదితర ప్రాంతాల్లో రైతాంగం కకావికలై చెట్టుకొకరు, గుట్టకొకరు చెదిరిపోయిన పరిస్థితి ఉండేది.
• సమైక్య పాలనలో చాలా భయంకరమైన పరిస్థితులు ఉండేవి.
• చొప్పదండి కూడా చాలా కరువు ప్రాంతంగా, భయంకర ఎడారి ప్రాంతంగా ఉండేది.
• చాలా నైపుణ్యంతోని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించుకుంటే కొంతమంది రాజకీయ అజ్నానులు మూర్ఖంగా పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతున్నా పట్టించుకోకుండా ఆ ప్రాజెక్టును పూర్తిచేసుకున్నాం.
• ఈరోజు భారత దేశం మొత్తం కలిపితే ఉండే వరి చేలు కంటే ఎక్కువగా తెలంగాణలోనే పండుతున్నది.
• ఇవ్వాల తెలంగాణలో 56 లక్షల ఎకరాల్లో వరిచేన్లు ఉన్నయ్. దాదాపు 20, 22 లక్షల ఎకరాల్లో ఇతర పంటలు కూడా ఉన్నయ్.
• రకరకాల ఇతర పంటలతో 84 లక్షల ఎకరాలు రెండవ పంటలో సాగులో ఉంది. ఇలా ఇండియాలో ఎక్కడా వ్యవసాయం లేదు.
• చెట్టుకొకలు పుట్టకొకలు అయిన రైతాంగాన్ని, వలసబోయిన మళ్లీ వెనక్కి రప్పించి వ్యవసాయాన్ని నిలబెట్టి బ్రహ్మాండంగా పనిచేసుకుంటా ఉన్నం.
• ఎవరెన్ని విమర్శలు చేసినా రైతులోకాన్ని, రైతులను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటున్నది తెలంగాణ ప్రభుత్వం.
• రైతు బంధు, రైత బీమా, 24 గంటల ఉచిత కరెంటు, ప్రాజెక్టుల నుంచి ఉచిత సాగునీరు ను దేశంలో ఎక్కడాలేని విధంగా అందిస్తున్నాం.
• పాత నీటి తీరువా బకాయిలు కూడా రద్దు చేసినం.
• చిల్లరమల్లర సమస్యలూ లేకుండా చేసినం.
• ఎత్తు భాగాల్లో ఉండే పొలాల్లో పండించుకునే అవకాశం ఏర్పడింది.
• గతంలో ఇలాంటి పచ్చని పంట పొలాలు కనిపించేవి కావు.
• ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఒక రిజర్వాయర్ అయింది కాబట్టి భూగర్భ జలాలు పెరిగాయని, అద్భుతంగా మేము పంటలు పండించుకుంటున్నామని రైతులు చెబుతా ఉన్నరు.
• నాలుగైదేండ్ల నుంచి నాకు మంచి పంటలు వచ్చి, మంచి లాభాలు వచ్చాయని రైతులు తెలిపారు.
• దురదృష్టవశాత్తూ ఈ ఒక్కసారి నాకు నష్టం వచ్చినా సరే తట్టుకుంటా అని ఒక రైతు చెబితే నాకూ చాలా సంతోషమైంది. గుండె ధైర్యమనిపించింది.
• దేశ చరిత్రలోనే ఎక్కడాలేని విధంగా మొదటిసారిగా ఎకరాకు రూ.10 వేలు ప్రకటించినం.
• కేంద్రానికి చెప్పినా దున్నపోతుకు చెప్పినా ఒకటే తీరుగ ఉన్నది.
• వాళ్లకు చెప్పీ చెప్పీ దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్లు..వాళ్లు బృందాలొచ్చుడు, తిరుగుడు, డ్రామాలు కొట్టుడు తప్ప ఇచ్చేది లేదు.
• కేంద్రాన్ని అడగను కూడా అడగదలుచుకోలేదు. వాళ్లకు చెప్పినా అర్థం కాదు.
• కనీసం సమస్యను అర్థం చేసుకొనే సంస్కారం కూడా లేదు. ఇప్పటివరకూ ఎన్నిసార్లడిగినా ఇవ్వలేదు. హైదరాబాద్ వరదలొచ్చినా ఇవ్వలేదు.
• ఇంక కూడా ఈ ఉపద్రవం జరిగే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
• ప్రపంచంలో, దేశంలో ఎక్కడాలేని వసతులను తెలంగాణ రైతాంగానికి చేకూర్చి వారిని కడుపులో పెట్టుకొని వ్యవసాయ రంగాన్ని ఒక ఉన్నతస్థితికి తీసుకొని పోగలిగాం.
• మన రాష్ట్ర జీడీపీ పెరిగింది. ఆదాయం కూడా పెరుగుతున్నది.
• ప్రజలకు పనిదొరికి, పల్లెలన్నీ సుఖ సంతోషాలతో విలసిల్లుతూ ఉన్నయ్.
• ఎట్టి పరిస్థితుల్లో ఆత్మ స్థైర్యం కోల్పోవద్దు. మీ వెంట కేసీఆర్ ఉంటడు . రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా ఉంటది.
• ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని ఉండాలె తప్ప మనసు చిన్నబుచ్చుకొని నారాజ్ కావొద్దు. ఇంకా బలంగా పనిచేస్తా ఉండాలె.
• సీఎస్ గారు జీవో కూడా ఇచ్చారు. తొందర్లోనే డబ్బులు కూడా వస్తయి.
• కౌలు రైతులు కూడా మునిగిపోకుండా ఆదుకోవాలని కలెక్టర్లకు చెప్పాం. సీఎస్ ఆదేశాల ప్రకారం వారినీ ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలి.
• రైతాంగం డిజార్డర్ కావొద్దు.. నీరుకారిపోవద్దనే సదుద్దేశంతోనే ఇటువంటి సాయం చేస్తున్నాం.
• వ్యవసాయ రంగంలో సంతరించుకోబడ్డ స్థితి ముందుకే వెళ్లాలనే సదుద్దేశంతోనే ముందుకు పోతున్నం.
• రైతాంగం ఇటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకొని రైతులోకం ముందుకొచ్చి ధైర్యంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా.
ఈ కార్యక్రమంలో మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్, రైతుబంధు సమితి ఛైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, దాసరి మనోహర్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, డిజిపి అంజనీ కుమార్, సీఎం సెక్రటరీ స్మితా సబర్వాల్, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, టెస్కాబ్ ఛైర్మన్ కొండూరు రవీందర్ రావు, ఎస్సీ కార్పోరేషన్ ఛైర్మన్ బండ శ్రీనివాస్, సివిల్ సప్లైస్ కార్పోరేషన్ ఛైర్మన్ రవీందర్ సింగ్, జడ్పీ ఛైర్మన్ కనుమళ్ళ విజయ, కరీంనగర్ మేయర్ సునీల్ రావు, సుడా ఛైర్మన్ జివి రామకృష్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ పొన్నం అనిల్ గౌడ్, సింగిల్ విండో ఛైర్మన్ వీర్ల వేంకటేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.
మరోవైపు సిఎం పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న కొద్ది సేపటికే పంట నష్ట పరిహారం విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం అందుకు జీవో విడుదల చేసింది. ఎకరానికి రూ.10 వేల సహాయం అందిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి ఈ నిధులు విడుదల చేశారు.