రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో పర్యటించనున్నారు. వైఎస్సార్ ఆసరా పథకం కింద మూడో విడత ఆర్ధిక సాయాన్ని ఆయన విడుదల చేయనున్నారు. మహిళా సంఘాల రుణాలను నాలుగు విడతల్లో మాఫీ చేస్తానని గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన జగన్ ఆ మేరకు ఇప్పటికే రెండు విడతలు పూర్తి చేశారు. నేడు మూడో విడతగా 78.94 లక్షల మంది పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లో రూ.6,419.89 కోట్ల మొత్తాన్ని జమ చేయనున్నారు.
2019 సార్వత్రిక ఎన్నికల నాటికి పొదుపు సంఘాల పేరిట మహిళలకు బ్యాంకుల్లో ఉన్న అప్పు మొత్తాన్ని ప్రభుత్వం మాఫీ చేస్తోంది. ఈ మొత్తాన్ని నేరుగా మహిళా సంఘాల ఖాతాల్లోనే జమ చేస్తోంది. ఎన్నికల నాటికి స్వయం సహాయక సంఘాలకు బ్యాంకుల్లో రూ.25,571 కోట్ల అప్పు ఉంది.
ఇప్పటికే రెండు విడతల్లో రూ.12,758.28 కోట్లను ప్రభుత్వం జమ చేసిన ప్రభుత్వం నేడు అందిస్తున్న నిధులతో కలిపి మొత్తం మూడు విడతల్లో రూ.19,178.17 కోట్లను చెల్లించినట్లు అవుతుంది. ఈ డబ్బులను ఎలాంటి ఆంక్షలు లేకుండా మహిళలు ఏ అవసరానికైనా వాడుకోవచ్చని సర్కారు గతంలోనే వెల్లడించింది.
ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి, 10.30 గంటలకు దెందులూరు చేరుకుంటారు. 10.50 – 12.35 బహిరంగ సభలో వైఎస్సార్ ఆసరా ఆర్ధిక సాయాన్ని విడుదల చేయనున్న సీఎం శ్రీ వైఎస్ జగన్, కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1.05 గంటలకు దెందులూరు నుంచి బయలుదేరి 1.35 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
Also Read : విభజన హామీలు అమలు చేయండి: సిఎం జగన్