మలేషియా పార్లమెంట్ ఈ రోజు (సోమవారం) కీలక నిర్ణయం తీసుకున్నది. తప్పనిసరి మరణశిక్ష, జీవిత ఖైదును తొలగించేందుకు తీసుకువచ్చిన చట్టానికి ఆమోదముద్ర వేసింది. పార్లమెంట్ నిర్ణయాన్ని హక్కుల సంఘాలు స్వాగతించాయి. వాస్తవానికి హత్య, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా తదితర తీవ్రమైన నేరాలకు మలేషియా దేశంలో మరణశిక్ష తప్పనిసరిగా ఉంది.
మలేషియా డిప్యూటీ న్యాయశాఖ మంత్రి రాంకర్పాల్ సింగ్ మాట్లాడుతూ.. ఉరి శిక్ష అనేది కోలుకోలేని శిక్ష అని, మరణశిక్ష తీసుకురావడానికి ఉద్దేశించిన ఫలితాలను తీసుకురాలేదని పార్లమెంట్‌లో పేర్కొన్నారు. పార్లమెంట్‌లో ఆమోదించిన చట్ట సవరణల నేపథ్యంలో హత్య, మాదకద్రవ్యాల అక్రమ రవాణాతో సహా ప్రస్తుతం మరణశిక్ష 34 నేరాలకు వర్తిస్తాయి. ప్రస్తుతం మలేషియాలో 1300 మందికిపైగా మరణశిక్ష, జీవిత ఖైదును ఎదుర్కొంటున్నారు. వీరికి ఉరిశిక్ష తప్పనున్నది. ప్రస్తుతం కొత్త నిబంధనల ప్రకారం వీరంతా శిక్షపై సమీక్ష కోరేందుకు అవకాశం లభించనున్నది.