దేశంలో అత్యంత రద్దీ అయిన ఎయిర్‌పోర్టుల్లో ఒకటి ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం. ముంబై ఎయిర్‌పోర్టుకు ప్రతిరోజూ 970 విమానాలు వచ్చిపోతూ ఉంటాయి. నిత్యం విమానాలు, ప్రయాణికులతో బిజీగా ఉండే ఈ ఎయిర్‌పోర్టులోని రెండు రన్‌వేలు మూతపడనున్నాయి. మే 2న ఆర్‌డబ్ల్యూవై 09/27, 14/32 రన్‌వేలను తాత్కాలికంగా 6 గంటల పాటు మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి ఏడాది వర్షాకాలానికి ముందు చేపట్టే నిర్వాహణ, మరమ్మత్తు పనుల కోసం ఈ రెండు రన్‌వేలను ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మూసివేస్తున్నామని చెప్పారు. నిర్వాహణ పనుల అనంతరం ఎయిర్‌పోర్ట్ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని వెల్లడించారు.
కాగా, ప్రతిఏడాది రన్‌వేల మరమ్మత్తు, నిర్వహణ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహిస్తారు. విమాన ప్రయాణికుల భద్రత కోసం రన్‌వేల నిర్వహణ అనేది విధిగా కొనసాగుతున్న కార్యాచరణ అని చెప్పారు. దీంతో విమానయాన సంస్థలతోపాటు ప్రయాణీకులకు అసౌకర్యాన్ని నివారించడానికి విమానాశ్రయానికి సంబంధించిన అన్ని వర్గాలకు ఈ మేరకు నోటీసు జారీ చేసినట్లు వెల్లడించారు.