సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి పేలవమైన ఆటతీరుతో పరాజయం మూటగట్టుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ తో నేడు జరిగిన మ్యాచ్ లో ఐదు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. లక్నో అటల్ బిహారీ వాజ్ పేయి ఏక్తా క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 121 పరుగులు మాత్రమే చేయగలిగింది. అన్మోల్ ప్రీత్ సింగ్-31; రాహుల్ త్రిపాఠి-35; అబ్దుల్ సమద్-21; వాషింగ్టన్ సుందర్-16 పరుగులు చేశారు. ఈ నలుగురే రెండంకెల స్కోరు చేయగలిగారు. మిగిలిన బ్యాట్స్ మెన్ ఘోరంగా విఫలమయ్యారు. ఈ మ్యాచ్ ద్వారా జట్టుతో చేరిన కెప్టెన్ ఏడెన్ మార్ క్రమ్ డకౌట్ అయ్యాడు. లక్నో బౌలర్లలో క్రునాల్ పాండ్యా మూడు, అమిత్ మిశ్రా రెండు; యష్ ఠాకూర్, రవి బిష్ణోయ్ చెరో వికెట్ సాధించారు.
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో45 పరుగులకు రెండు వికెట్లు (కేల్ మేయర్స్-13; దీపక్ హుడా-7) కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ కెఎల్ రాహుల్-క్రునాల్ పాండ్యా మూడో వికెట్ కు 55 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రాహుల్ 31 బంతుల్లో 4 ఫోర్లతో35; క్రునాల్ 23 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్ తో 34 పరుగులు చేసి ఔట్ కాగా, రోమానియో షెఫర్డ్ డకౌట్ అయ్యాడు. మార్కస్ స్టోనిస్-10; నికోలస్ పూరన్-11 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. 16 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.
హైదరాబాద్ బౌలర్లలో ఆదిల్ రషీద్ రెండు, భువీ, ఉమ్రాన్ మాలిక్, ఫజల్ హక్ ఫారూఖి తలా ఒక వికెట్ పడగొట్టారు.
ఆల్రౌండ్ ప్రతిభ చూపిన కృనాల్ పాండ్యా కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.