బీహార్ సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ బుధవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీని కలిశారు. మంగళవారం ఢిల్లీ చేరుకున్న సీఎం నితీశ్ కుమార్, తన డిప్యూటీ తేజస్వీతో కలిసి మల్లికార్జున్ ఖర్గే నివాసానికి బుధవారం వెళ్లారు. అక్కడకు వచ్చిన రాహుల్ గాంధీ సమక్షంలో వారంతా కలిసి మాట్లాడుకున్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్షాల ఐక్యత గురించి చర్చించారు. అయితే ఢిల్లీలో ఉన్న సీఎం నితీశ్ కుమార్ ఇతర ప్రతిపక్ష నేతలతో కూడా సమావేశం కానున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని గద్దే దించేందుకు ప్రతిపక్షాలను ఒకతాటిపైకి తెచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు.
కాగా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా బీజేపీకి వ్యతిరేకంగా కలిసి వచ్చే ప్రతిపక్ష పార్టీల మధ్య ఐక్యతను పెంపొందించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల పలువురు నేతలతో ఆయన మాట్లాడారు. డీఎంకే చీఫ్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, శివసేనకు చెందిన మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేను సంప్రదించారు. రాబోయే రోజుల్లో ప్రతిపక్ష పార్టీలకు చెందిన అగ్ర నాయకులతో మల్లికార్జున్ ఖర్గే సమావేశం కానున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓడించే లక్ష్యంగా వారితో చర్చలు జరుపనున్నారు.