Sunday, November 24, 2024
Homeస్పోర్ట్స్IPL: చెన్నైపై పోరాడి ఓడిన బెంగుళూరు

IPL: చెన్నైపై పోరాడి ఓడిన బెంగుళూరు

ఐపీఎల్ లో నేడు జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుపై చెన్నైసూపర్ కింగ్స్ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 6 వికెట్లకు 226 పరుగులు చేయగా భారీ లక్ష్య సాధనలో బరిలోకి దిగిన బెంగుళూరు చివరి వరకూ పోరాడి 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ­218 పరుగులు చేయగలిగింది.

బెంగుళూరు చిన్న స్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ కేవలం మూడు పరుగులే చేసి జట్టు స్కోరు 16 వద్ద వెనుదిరిగాడు. రెండో వికెట్ కు డెవాన్ కాన్వే- అజింక్యా రెహానే లు 74 పరుగులు చేశారు. రెహానే 20 బంతుల్లో  3 ఫోర్లు 2 సిక్సర్లతో 37;  కాన్వే 45 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 83;  శివమ్ దూబే 27 బంతుల్లో 2 ఫోర్లు  5 సిక్సర్లతో 52 పరుగులతో సత్తా చాటగా, అంబటి రాయుడు-14; రవీంద్ర జడేజా -10 రన్స్ చేసి వెనుదిరిగాడు. మొయిన్ అలీ-19; కెప్టెన్ ధోని-1 పరుగుతో నాటౌట్ గా నిలిచారు.

బెంగుళూరు బౌలర్లు సిరాజ్, పార్నెల్, విజయ్ కుమార్, మాక్స్ వెల్, హసరంగ, హర్షల్ పటేల్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.

లక్ష్య సాధనలో బెంగుళూరు 15 పరుగులకే రెండు వికెట్లు (విరాట్ కోహ్లీ-6; మహిపాల్ లామ్రోర్ డకౌట్) కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ డూప్లేసిస్- మాక్స్ వెల్ లు ధాటిగా ఆడుతూ రెండో వికెట్ కు 126 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. మాక్స్ వెల్ 36 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సర్లతో 76;  డూప్లేసిస్ 33 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 62 పరుగులు చేసి 18 పరుగుల తేడాతో ఇద్దరూ ఔటయ్యారు. ఆ తర్వాత దినేష్ కార్తీక్ -28; ప్రభు దేశాయ్-19; షాబాజ్ అహ్మద్-12 పరుగులు చేశారు. చివరకు 8 పరుగులతో బెంగుళూరు ఓటమి పాలైంది.

చెన్నై బౌలర్లలో తుషార్ దేశ్ పాండే 3;  మతీశ పతిరణ 2; ఆకాష్ సింగ్, తీక్షణ, మోయిన్ ఆలీ తలా ఒక వికెట్ సాధించారు.

డెవాన్ కాన్వే కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్