ఐపీఎల్ ఈ సీజన్ లో మంచి ఊపుమీదున్న రాజస్థాన్ రాయల్స్ కు ఎదురుదెబ్బ తగిలింది. లక్నో సూపర్ జెయింట్స్ పది పరుగుల తేడాతో రాజస్థాన్ పై విజయం సాధించింది, 155 పరుగుల లక్ష్య ఛేదనలో చతికిలపడిన రాజస్థాన్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. ఆరంభంలో నిలకడగా ఆడినా ఆ తర్వాత వరుస వికెట్లు కోల్పోయి ఓటమి పాలైంది.
జైపూర్ లోని స్వామీ మాన్ సింగ్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో రాజస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. లక్నో తొలి వికెట్ కు 85 పరుగులు జోడించి పటిష్టంగా ఉంది. కెప్టెన్ రాహుల్ 32 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్ తో 39 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆయూష్ బదోని (1); దీపక్ హుడా (2) విఫలమయ్యారు. ఈ దశలో స్కోరు బోర్లు నెమ్మదించింది. కాసేపటికే మరో ఓపెనర్ కేల్ మేయర్స్ (42 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 51) కూడా వెనుదిరిగాడు. స్టోనిస్-21; నికోలస్ పూరన్-29 పరుగులు చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది.
రాజస్థాన్ బౌలర్లలో అశ్విన్ 2; బౌల్ట్, సందీప్ శర్మ, హోల్డర్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
రాజస్థాన్ తొలి వికెట్ కు 87 పరుగులు చేసింది. జైస్వాల్ 44 రన్స్ చేసి ఔట్ కాగా, కెప్టెన్ సంజూ శామ్సన్ (2)రనౌట్ అయ్యాడు. జోస్ బట్లర్ -40; దేవదత్ పడిక్కల్ 26 పరుగులు సాధించారు. రియాన్ పరాగ్ 15 తో నాటౌట్ గా నిలిచాడు.
లక్నో బౌలర్లలో అవేష్ ఖాన్ 3; స్టోనిస్ 2 వికెట్లు పడగొట్టారు.
స్టోనిస్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ లభించింది.