చెన్నై సూపర్ కింగ్స్ జూలు విదిల్చింది. నేడు జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ పై 49 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై235 పరుగుల భారీ స్కోరు చేసింది, ఈ సీజన్ లో ఇదే హయ్యస్ట్ స్కోరు. లక్ష్యసాధనలో కోల్ కతా 8 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేయగలిగింది.
ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన ఈ మ్యాచ్ లో కోల్ కతా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. చెన్నై తొలి వికెట్ కు 73 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ 20 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్సర్లతో 35 పరుగులు చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే 40 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 56 పరుగులు చేసి రెండో వికెట్ గా వెనుదిరిగాడు. ఈ సమయానికి 13 బంతుల్లో 18 పరుగులతో క్రీజులో ఉన్నఅజింక్యా రేహానే తర్వాత వచ్చిన శివమ్ దూబేలు కోల్ కతా బౌలర్లపై ప్రతాపం చూపి ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. వీరిద్దరూ కలిసి 85 పరుగులు జోడించారు. శివమ్ దూబే 21 బంతుల్లో 2 ఫోర్లు 5 సిక్సర్లతో 50 రన్స్ సాధించి ఔటయ్యాడు. జడేజా 8 బంతుల్లో 2 సిక్సర్లతో 18 స్కోరు చేసి వెనుదిరిగాడు. రేహానే కేవలం 29 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 71 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది.
కోల్ కతా బౌలర్లలో కుల్వంత్ కేజ్రోలియా 2; వరుణ్ చక్రవర్తి, సుయాష్ శర్మ చెరో వికెట్ పడగొట్టారు.
భారీ లక్ష్య సాధనలో కోల్ కతా ఒక్క పరుగు వద్ద ఓపెనర్ల ఇద్దరి వికెట్లూ (జగదీషన్-1; సునీల్ నరిన్ డకౌట్) కోల్పోయింది. వెంకటేష్ అయ్యర్-20; కెప్టెన్ నితీష్ రాణా-27 పరుగులు చేసి ఔటయ్యారు. ఈ దశలో జేసన్ రాయ్, రింకూ సింగ్ తో కలిసి సూపర్ ఇన్నింగ్స్ ఆడి 26 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 61 పరుగులు చేసి తీక్షణ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత రింకూ సింగ్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. ఆండ్రీ రస్సెల్ (9); డేవిడ్ వీస్ (1) విఫలమయ్యారు. రింకూ సింగ్ 33 బంతుల్లో 3 ఫోర్లు,4 సిక్సర్లతో 53 పరుగులతో అజేయంగా నిలిచాడు.
చెన్నై బౌలర్లలో తుషార్ దేశ్ పాండే, మహీశ తీక్షణ చెరో 2; ఆకాష్ సింగ్, మోయిన్ అలీ, రవీంద్ర జడేజా, మతీష ప్రతిరణలకు తలా ఒక వికెట్ దక్కింది.
అజింక్యా రెహానే కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.