ముఖ్యమంత్రి నేరుగా ప్రజలతో మమేకమయ్యే ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమానికి మే నెల 9న శ్రీకారం చుడుతున్నట్లు సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా ముఖ్యమంత్రికి తెలియజేయవచ్చని, సిఎం తో పాటు సిఎంవో ఈ సమస్యలను నిర్దేశిత సమయంలోగా పరిష్కారం అయ్యేలా చూస్తుందని వెల్లడించారు. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో స్పందన కార్యక్రమంపై క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జగనన్నకు చెబుదాం కార్యక్రమంపై ప్రతేకంగా వారికి దిశా నిర్దేశం చేశారు. ఇది మరో ప్రతిష్టాత్మక కార్యక్రమమని, దీనికోసం 1902 అనే హెల్ప్ లైన్ నంబర్‌ను పెడుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంపై ఇప్పటికే పలుమార్లు సమీక్షలు చేశామన్నారు.
మనం ఇప్పటికే స్పందన నిర్వహిస్తున్నామని, దీనికి మెరుగైన మెరుగైన రూపమే ‘జగనన్నకు చెబుదాం’ అని పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన సేవలను అందించడం, వ్యక్తిగత సమస్యలను అత్యంత నాణ్యంగా పరిష్కరించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని స్పష్టం చేశారు. ప్రభుత్వ సేవలు, పథకాలపై ఎంక్వైరీ, ముఖ్యమంత్రి సందేశాలను నేరుగా చేరవేయడం కూడా దీనిలో ప్రధాన భాగాలని చెప్పారు.
జగనన్నకు చెబుదాం పై సిఎం సూచనలు:
- ఐవీఆర్ఎస్, ఎస్ఎంఎస్ ల ద్వారా తాము చెప్పిన సమస్యల పరిష్కారంపై ప్రజలకు క్రమం తప్పకుండా అప్డేట్స్ అందుతాయి. అర్జీదారులనుంచి ఫీడ్ బ్యాక్ కూడా తీసుకుంటుంది.
- గ్రామ, వార్డు సచివాలయాల్లో వాలంటీర్లు ప్రతి ఇంటినీ సందర్శించి 1902 హెల్ప్ లైన్ గురించి అవగాహన కల్పిస్తారు.
- ఈ హెల్ప్‌లైన్‌ను వినియోగించుకునేలా వారిని మరింతగా ప్రోత్సహిస్తారు.
- సీఎం కార్యాలయం నుంచి మండల కార్యాలయాల వరకూ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్లు ఉంటాయి.
- సీనియర్ ఐఏఎస్ అధికారులు జిల్లాలకు ప్రత్యేకాధికారులుగా ఉంటారు.
- క్రమం తప్పకుండా ఆయా జిల్లాలను వీరు సందర్శించి పర్యవేక్షిస్తారు.
- ప్రతి 15 రోజులకోసారి సంబంధిత జిల్లాలను çసందర్శించి పర్యవేక్షిస్తారు.
- కలెక్టర్లతో కలిపి జగనన్నకు చెబుదాం కార్యక్రమం అమలును పర్యవేక్షిస్తారు.
- సమస్యల పరిష్కారాల తీరును రాండమ్‌గా చెక్చేస్తారు.
- ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ల పనితీరును పర్యవేక్షిస్తారు.
- ఎక్కడైనా సమస్య పరిష్కారం పట్ల సంతృప్తి లేకపోతే.. దాన్ని తిరిగి ఓపెన్ చేస్తారు.
- ఎస్ఎంఎస్, ఐవీఆర్ఎస్ ద్వారా వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా దాన్ని తిరిగి తెరుస్తారు.
- పరిష్కార తీరుపై పూర్తిస్థాయిలో సమీక్ష చేస్తారు:
- చీఫ్ సెక్రటరీ, సీఎంఓ, డీజీపీతో కలిసి రెగ్యులర్‌గా మానిటర్ చేస్తారు.
- ప్రతి 15 రోజులకోసారి పూర్తిస్థాయిలో సమీక్ష ఉంటుంది.