మణిపూర్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. మైతీ తెగకు ఎస్టీ హోదా ఇవ్వొద్దంటూ ఆల్ ట్రైబల్ స్టూటెండ్స్ యూనియన్ మణిపూర్ చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. హింసకు సంబంధించి తీవ్రమైన పరిస్థితులు తలెత్తితే ‘కనిపిస్తే కాల్చివేత’ ఉత్తర్వులను అమలు చేయాలని అధికారులను ఆదేశించింది. పరిస్థితి అదుపు తప్పడంతో సైన్యం రంగంలోకి దిగింది. రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. గిరిజనేతరులు ఎక్కువగా ఉండే జిల్లాల్లో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. మణిపూర్ జనాభాలో 40 శాతంగా ఉన్న మైతీ తెగకు ఎస్టీ హోదా కల్పించాలని ఆ రాష్ట్ర హైకోర్టు గత నెలలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని రాష్ట్రంలో 53 శాతం జనాభా కలిగిన ఇతర గిరిజన తెగలు నిరసించాయి.
కాగా, మణిపూర్‌లో ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని ఆర్మీ అధికారులు తెలిపారు. భద్రతా బలగాలు నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నాయని చెప్పారు. అయితే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో మణిపూర్‌కు వెళ్లాల్సిన అన్ని రైళ్లను రద్దు చేసినట్టు నార్త్‌ఈస్ట్ ఫ్రాంటీయర్ రైల్వే వర్గాలు వెళ్లడించాయి. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాత రైళ్ల పునరుద్ధరణకు సంబంధించి నిర్ణయం తీసుకుంటామని తెలిపాయి.