కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లోకాంగ్రెస్ పార్టీ విజయం సాధించినా.. ఆ పార్టీ మార్కు రాజకీయం మళ్ళీ మొదలైంది. ఎవరు సీఎం అవుతారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్.. సీఎం పదవి రేసులో కొనసాగుతున్నారు. రెండు రోజులు గడుస్తున్నా ముఖ్యమంత్రి ఎంపిక జరగలేదు. సీఎం అభ్యర్థిని తేల్చేందుకు ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలు తర్జనభర్జన పడుతున్నారు.
ఇప్పటికే సిద్దరామయ్య ఢిల్లీ చేరుకున్నారు. ఇవాళ డీకే శివకుమార్ కూడా కాంగ్రెస్ సీనియర్లతో భేటీ అయ్యేందుకు ఢిల్లీ వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తమది ఐక్య కూటమి అని, మా సంఖ్య 135 అని, కూటమిని విభజించాలన్న ఆలోచన తనకు లేదని డీకే అన్నారు. కాంగ్రెస్ అధిష్టానం తనను ఆదరించినా, ఆదరించకపోయినా.. తాను బాధ్యత కలిగిన వ్యక్తి అని అన్నారు. ఎవర్ని వెన్నుపోటు పొడవను అని, ఎవర్నీ బ్లాక్‌మెయిల్ చేయడం లేదని డీకే తెలిపారు. కడుపు ఇన్‌ఫెక్షన్ వల్ల నిన్న తాను బెంగుళూరులోనే ఉండి పోవాల్సి వచ్చిందని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే తెలిపారు.