సన్ రైజర్స్ హైదరాబాద్ సొంత గడ్డపై మరోసారి అభిమానులను నిరాశపరిచింది, ఈసారి బ్యాటింగ్ లో ఫర్వాలేదనిపించినా బౌలింగ్ లో చతికిలపడి రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు చేతిలో 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో బెంగుళూరు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. హైదరాబాద్ జట్టు స్కోరు 27,28 వద్ద రెండు వరుస వికెట్లు కోల్పోయింది. అభిషేక్ శర్మ(11), రాహూల్ త్రిపాఠి (15)విఫలమయ్యారు. ఈ దశలో కెప్టెన్ మార్ క్రమ్ – హెన్రిచ్ క్లాసేన్ లు మూడో వికెట్ కు 76 పరుగులు జోడించారు. ఏడెన్ నెమ్మదిగా ఆడుతూ స్ట్రైకింగ్ క్లాసేన్ కు ఇస్తూ వచ్చాడు. 104 పరుగుల వద్ద ఏడెన్ (18) ఔటయ్యాడు, క్లాసేన్- హ్యారీ బ్రూక్ లు నాలుగో వికెట్ కు 78 పరుగులు చేశారు. 51 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 104 పరుగులు చేసిన క్లాసేన్ 19వ ఓవర్లో ఔటయ్యాడు. బ్రూక్ 24 రన్స్ తో నాటౌట్ గా నిలవగా, గ్లెన్ ఫిలిప్స్ (5) ఇన్నింగ్స్ చివరి బంతికి ఔటయ్యాడు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. బెంగుళూరు బౌలర్లలో బ్రేస్ వెల్ 2; సిరాజ్, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
బెంగుళూరు ఓపెనర్లు విరాట్ కోహ్లీ- డూప్లెసిస్ లు తొలి వికెట్ కు 172 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేశారు. 63 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 100 పరుగులు పూర్తి చేసుకున్న కోహ్లీ భువీ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే 47 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 71 పరుగులు చేసిన డూప్లేసిస్ కూడా వెనుదిరిగాడు. గ్లెన్ మాక్స్ వెల్, బ్రేస్ వెల్ లు మరో వికెట్ పడకుండా నాలుగు బంతులు మిగిలి ఉండగానే విజయం అందించారు.
హైదరాబాద్ బౌలర్లు భువి, నటరాజన్ కు చెరో వికెట్ దక్కింది.
విరాట్ కోహ్లీ కి ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.