రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్ అమెరికా పర్యటన ఫలప్రదంగా సాగుతోంది. ప్రతిష్టాత్మక కంపెనీలు హైదరాబాద్ లో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముందుకు వస్తున్నాయి. తాజాగా మరో కంపెనీ ఈ జాబితాలో చేరింది. హూస్టన్‌లో ఉన్న కేటీఆర్ నేడు అలియంట్ హెడ్ క్వార్టర్స్‌ను సందర్శించారు. హైదరాబాద్‌లో అలియంట్ గ్రూప్ విస్తరణకు ఆ కంపెనీ సిఈవో ధవల్ జాదవ్ సంసిద్ధత వ్యక్తం చేశారు. దీనిపై మంత్రి కేటిఆర్ హర్షం వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమాల్లో ఈ వార్తను పంచుకున్నారు.
అలియంట్ హెడ్ క్వార్టర్స్ లో తనకు అపూర్వ స్వాగతం లభించిందని, వారు రిసీవ్ చేసుకున్న తీరు, ఆతిథ్యం ఎంతో సంతోషం కలిగించిందన్నారు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈ సంస్థ హైదరాబాద్ లో తమ కార్యకలాపాలు విస్తరించేందుకు ముందుకొచ్చిందని, దీనితో పాటు ట్యాక్స్, అకౌంటింగ్, ఆడిట్ సర్వీసెస్, కోర్ ఐటి టెక్నాలజీలలో యువతకు గొప్ప అవకాశాలు వస్తాయని కేటిఆర్ ధీమా వ్యక్తం చేశారు. దాదాపు 9 వేల కొత్త ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు.అలయంట్ తీసుకున్న నిర్ణయం హైదరాబద్ నగరంపై బ్యాంకింగ్, ఫైనాన్సు, ఇన్సూరెన్సు రంగ కంపెనీలకు ఉన్న విశ్వాసాన్ని రుజువు చేస్తుందని వెల్లడించారు.