రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరును దురదృష్టం వెంటాడింది. ప్లే ఆఫ్స్ కు చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో ఓటమిపాలై లీగ్ దశలోనే వెనుదిరిగింది. బెంగుళూరు చినస్వామి స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ తో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగుళూరు నిర్ణీత 20 ఓవర్లలో 197 పరుగులు చేయగా, ఈ లక్ష్యాన్ని గుజరాత్ 4 వికెట్లు కోల్పోయి మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే చేరుకుంది. ఓపెనర్ శుభ్ మన్ గిల్ మరోసారి రాణించి సెంచరీతో అజేయంగా నిలిచాడు.
గుజరాత్ విజయంతో ముంబై ప్లే ఆఫ్స్ కు చేరుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన బెంగుళూరు ఇన్నింగ్స్ దూకుడుగానే మొదలు పెట్టింది. విరాట్ కోహ్లీ మరో సెంచరీ తన ఖాతాలో నమోదు చేసుకున్నాడు. 61 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్సర్ తో 101 పరుగులతో అజేయంగా నిలవగా, కెప్టెన్ డూప్లెసిస్-28; బ్రేస్ వెల్ -26; అనూజ్ రావత్-23 పరుగులు చేశారు. మాక్స్ వెల్-11; లామ్రోర్-1; దినేష్ కార్తీక్ (డకౌట్) విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో నూర్ అహ్మద్ 2; షమీ, యష్ దయాళ్, రషీద్ ఖాన్ తలా ఒక వికెట్ సాధించారు.
లక్ష్య సాధనలో గుజరాత్ 25 పరుగుల వద్ద ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (12) వికెట్ కోల్పోయింది. శుభ్ మన్ గిల్- విజయ్ శంకర్ లు రెండో వికెట్ కు 123 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. 35 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 పరుగులు చేసి ఔటయ్యాడు. దాసున్ శనక(డకౌట్); డేవిడ్ మిల్లర్ (6) విఫలమయ్యారు. గిల్ 52 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 104 పరుగులతో అజేయంగా నిలిచి విజయం అందించాడు. బెంగుళూరు బౌలర్లలో సిరాజ్ 2; వ్యాసక్ విజయ్ కుమార్, హర్షల్ పటేల్ చెరో వికెట్ పడగొట్టారు.
శుభ్ మన్ గిల్ కే ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ లభించింది.